మద్యం తాగి కారు నడిపిన మహిళా మంత్రి గారు.. ఆపై రాజీనామా..!

న్యూజిలాండ్‌ మంత్రి ఒకరు మద్యం తాగి రోడ్డు ప్రమాదానికి కారణమయ్యారు. ఆ తర్వాత పోలీసులకు ఏమాత్రం సహకరించకుండా ఇబ్బంది పెట్టారు. చివరికి మంత్రి పదవి కోల్పోయారు.

Updated : 24 Jul 2023 10:58 IST

ఇంటర్నెట్‌డెస్క్: ఆమె ఓ దేశ న్యాయశాఖ మంత్రి. మద్యం తాగి కారు డ్రైవింగ్‌ చేస్తూ ప్రమాదానికి కారణం అయ్యారు. అక్కడికి చేరుకొన్న పోలీసులు బ్రీతింగ్‌ పరీక్ష నిర్వహించగా ఆమె మోతాదుకు మించి మద్యం తాగినట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఆమెను అరెస్టు చేయబోగా.. తీవ్రంగా ప్రతిఘటించారు. కానీ, పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. విషయం గుప్పుమనడంతో చివరికి పదవికి రాజీనామా చేశారు. ఈ ఘటన న్యూజిలాండ్‌లో చోటు చేసుకొంది.

న్యూజిలాండ్‌ న్యాయశాఖ మంత్రి కిరి అలెన్‌ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆమె పదవికి రాజీనామా చేశారు. ఆదివారం రాత్రి మద్యం తాగి కారును అతివేగంగా నడిపారు. దీంతో ఓ పార్కింగ్‌లోని వాహనాలను ఆమె కారు ఢీకొంది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని పరీక్షించగా ఆమె మద్యం తాగినట్లు తేలింది. దీనికి తోడు ఆమె అరెస్టుకు సహకరించలేదు. చివరికి ఆమెను పోలీస్‌ స్టేషన్‌కు తరలించి నాలుగు గంటలపాటు ఉంచారు. తాజాగా ఆమె కోర్టులో కేసును ఎదుర్కోవాల్సి ఉంది. ఈ కారణంగా ఆమె సోమవారం పదవికి రాజీనామా చేశారు.

నాడు స్టాలిన్‌.. నేడు పుతిన్‌

ప్రధాని క్రిస్‌ హిప్కిన్స్‌ సోమవారం ఉదయం అలెన్‌తో మాట్లాడారు. ఆమె మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారని.. మంత్రిగా విధులు నిర్వహించేందుకు తగినంత ఫిట్‌గా లేరని పేర్కొన్నారు. న్యాయశాఖ మంత్రి క్రిమినల్‌ కేసులో ఇరుక్కోవడం సహించరానిదన్నారు. దీంతో అలెన్‌ రాజీనామా చేయడానికి అంగీకరించారు. పార్లమెంట్‌ సభ్యురాలిగా మాత్రం ఆమె కొనసాగుతారు. 

లేబర్‌ పార్టీలో 39 ఏళ్ల అలెన్‌ చాలా వేగంగా ఎదిగారు. కానీ, ఇటీవల కాలంలో ఆమె తన జీవిత భాగస్వామి నుంచి విడిపోయారు. అప్పటి నుంచి ఆమె తీరు మారిపోయింది. తన బృందంలోని ఉద్యోగులతో కూడా ఆమె ప్రవర్తన సరిగా ఉండటం లేదనే ఆరోపణలున్నాయి. దీనిపై ప్రధాని హిప్కిన్స్‌ మాట్లాడుతూ.. అలెన్‌ను చూస్తే బాధగా అనిపించిందని.. ఆమె చాలా ప్రతిభావంతురాలని పేర్కొన్నారు. ఆమె కొన్ని సమస్యలతో పోరాడుతున్నారని చెప్పారు. హిప్కిన్స్‌ మంత్రి వర్గంలో పదవి కోల్పోయిన నాలుగో మంత్రి ఆమె. అక్టోబర్‌ 14 తేదీన న్యూజిలాండ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో మంత్రుల వివాదాలు, రాజీనామాలు అక్కడి ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు