USA Storms: అమెరికాలో టోర్నడోల బీభత్సం.. ఏడుగురి మృతి!

అమెరికాలో బలమైన తుపానులు, టోర్నడోల ధాటికి ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

Published : 26 May 2024 22:05 IST

వాషింగ్టన్‌: అమెరికా (USA)ను శక్తిమంతమైన తుపానులు కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా మధ్య అమెరికాలోని టెక్సాస్‌, ఓక్లహోమా, ఆర్కాన్సాస్‌లలో పరిస్థితులు దారుణంగా మారాయి. భీకర గాలుల విధ్వంసానికి అనేక చోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకూలాయి. వేలాది సముదాయాలకు విద్యుత్‌ సరఫరాకు ఆటంకం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. టెక్సాస్‌లో ఓక్లహామా సరిహద్దు సమీపంలోని కూక్‌ కౌంటీలో టోర్నడో బీభత్సానికి ఐదుగురు మృతిచెందారు. వారిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారని అధికారులు తెలిపారు.

డల్లాస్‌, డెంటన్‌ తదితర చోట్ల ఏర్పడిన టోర్నడోల ధాటికి అనేక వాహనాలు తిరగబడ్డాయి. దీంతో రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. డల్లాస్‌లో డ్రైవర్లు విశ్రాంతి తీసుకునే ‘హైవే ట్రావెల్ సెంటర్‌’కు భారీ నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. ఓక్లహామాలోని వుడ్స్‌ కౌంటీలో బేస్‌బాల్‌ పరిమాణంలో వడగళ్లు పడటంతో.. ఓ బహిరంగ వివాహ వేడుకకు వచ్చిన అతిథులు గాయపడ్డారు. ఆర్కాన్సాస్‌లోని బెంటన్‌ కౌంటీలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆయా ఘటనల్లో పలువురు గాయాలపాలయ్యారని, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించినట్లు వెల్లడించారు. ఓక్లహామాలోని క్లేర్‌మోర్‌లో రోజువారీ కార్యకలాపాలు నిలిచిపోయాయి.

కొండచరియల బీభత్సం ఘటన.. 670 మంది సమాధి..!

నార్త్ కరోలినా, వర్జీనియాలో సోమవారం ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని సంబంధిత నిపుణులు అంచనా వేశారు. పశ్చిమ టెక్సాస్‌, న్యూ మెక్సికో, అరిజోనా, కొలరాడో, ఓక్లహామాలోని కొన్ని ప్రాంతాల్లో కార్చిచ్చులు ఏర్పడే ప్రమాదం ఉందనే హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇదిలా ఉండగా.. ఏప్రిల్, మే నెలల్లో అమెరికాలో పెద్దసంఖ్యలో టోర్నడోలు విరుచుకుపడుతుంటాయి. అధికారిక వివరాల ప్రకారం.. అగ్రరాజ్యంలో ఏటా ఈ వ్యవధిలో నమోదయ్యే సగటు టోర్నడోల సంఖ్య కంటే 2024లో 25 శాతం ఎక్కువ నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు