Landslide: కొండచరియల బీభత్సం ఘటన.. 670 మంది సమాధి..!

పపువా న్యూ గినియాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో దాదాపు 670 మందికిపైగా సమాధి అయినట్లు సమాచారం.

Published : 26 May 2024 15:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పసిఫిక్‌ దేశమైన పపువా న్యూ గినియా (Papua New Guinea)లోని ఎన్గా ప్రావిన్స్‌లో పెద్దఎత్తున కొండచరియలు విరిగిపడి (Landslide) బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. శుక్రవారం నాటి ఈ ప్రకృతి విపత్తు కారణంగా తొలుత 100 మందికిపైగా మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. ఈ సంఖ్య భారీగానే ఉన్నట్లు ఐరాస (UN) తాజాగా అంచనా వేసింది. దాదాపు 670 మందికిపైగా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని ‘అంతర్జాతీయ వలసల సంస్థ (IOM)’ తెలిపింది. దాదాపు నాలుగు ఫుట్‌బాల్ మైదానాల మేర విస్తీర్ణంలో శిథిలాలు పరచుకున్నట్లు సమాచారం.

‘‘ప్రమాద సమయంలో తొలుత 60 ఇళ్లు కొండచరియల కింద నేలమట్టమైనట్లు భావించాం. అయితే, స్థానిక అధికారుల లెక్కల్లో మొత్తం 150 ఇళ్లు శిథిలాల కింద కూరుకుపోయినట్లు తేలింది. దాదాపు 670 మంది సమాధి అయినట్లు వారు భావిస్తున్నారు. ఆరు నుంచి ఎనిమిది మీటర్ల లోతులో చిక్కుకుపోయిన వారు ప్రాణాలతో బయటపడే అవకాశం దాదాపు లేనట్లే’’ అని వలసల సంస్థ అధికారులు వెల్లడించారు. ఆదివారం నాటికి కేవలం అయిదు మృతదేహాలు మాత్రమే వెలికితీసినట్లు సమాచారం. మరోవైపు.. ప్రాణాలతో బయటపడిన వారిని అధికారులు సురక్షితమైన ప్రదేశాలకు తరలిస్తున్నారు.

ఘోరం.. కొండచరియలు విరిగిపడి 100 మందికి పైగా మృతి..!

పపువా న్యూ గినియా రాజధాని పోర్ట్‌ మోర్స్బీకి 600 కిలోమీటర్ల దూరంలోని ఎన్గా ప్రావిన్స్‌లో ఈ విపత్తు సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రజలు నిద్రలో ఉన్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో ప్రాణనష్టం భారీగా వాటిల్లింది. ఒకవైపు మరిన్ని కొండచరియలు విరిగిపడే ముప్పు పొంచివుండటం.. మరోవైపు ప్రావిన్స్‌ రాజధాని వాబాగ్‌ నుంచి ఘటనాస్థలానికి చేరుకునే మార్గంలో తెగల ఘర్షణల కారణంగా బాధితులకు సహాయక సామగ్రి చేరవేయడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయని అధికారులు తెలిపారు. సహాయక కాన్వాయ్‌లకు సైనికులు భద్రత కల్పిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని