Japan: అరుదైన ఘటన..బుల్లెట్ ట్రైన్‌ 17 నిమిషాలు ఆలస్యం

జపాన్‌(Japan)లో రైళ్లు సమయపాలనకు పెట్టింది పేరు. అలాంటిది ఒక బుల్లెట్‌ రైలు ఏకంగా కొన్నినిమిషాల పాటు ఆలస్యమైంది. అందుకు కారణం ఏంటంటే..?

Updated : 17 Apr 2024 13:58 IST

టోక్యో: జపాన్‌ బుల్లెట్‌ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. అలాంటిది నగోయా-టోక్యో మధ్య ప్రయాణించిన ఒక షింకాన్‌సెన్‌ రైలు ఏకంగా 17 నిమిషాలు ఆలస్యమైంది. ఈ అరుదైన ఘటనకు ఓ పాము కారణమైంది..! 

మంగళవారం సాయంత్రం ప్రయాణికులు రైలుపై ఒక పామును గుర్తించారు. అయితే అది అక్కడకు ఎలా చేరిందో పరిశీలిస్తున్నామని సెంట్రల్ జపాన్ రైల్వే కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని చెప్పారు. సాధారణంగా ఈ రైళ్లలో పావురాలు, చిన్న కుక్కపిల్లలను తీసుకెళ్లే వీలుంది. పాములకు మాత్రం అనుమతి లేదు. కానీ, తాము ప్రయాణికుల లగేజీని తనిఖీ చేయబోమని వెల్లడించారు.

బుల్లెట్‌ రైలును జపాన్‌లో షింకాన్‌సెన్‌ అని పిలుస్తారు. ఆ దేశ భాషలో ‘కొత్త ట్రంక్‌లైన్‌’ అని దీని అర్థం. 1964 అక్టోబరు 1న.. టోక్యో ఒలింపిక్స్‌కు తొమ్మిది రోజుల ముందు ఈ సర్వీసు ప్రారంభమైంది. తొలుత టోక్యో నుంచి ఒసాకా మధ్య దీని రాకపోకలు సాగాయి. ప్రస్తుతం జపాన్‌లో షింకాన్‌సెన్‌ నెట్‌వర్క్‌.. 2,700 కిలోమీటర్లకు విస్తరించింది. ఈ రైళ్ల విశ్వసనీయత చాలా ఎక్కువ. 

ఒక ట్రిప్‌లో ఈ రైళ్ల ఆలస్యం.. సరాసరిన నిమిషం కన్నా చాలా తక్కువే ఉంటుంది. అందువల్ల ప్రయాణికులు సకాలంలో గమ్యస్థానాలకు చేరుకుంటారు. మొదట్లో ఈ రైలు గరిష్ఠ వేగం గంటకు 210 కిలోమీటర్లు. ఆ తర్వాత ఇది గంటకు 300 కిలోమీటర్లకు పెరిగింది. నిత్యం లక్షల మందికి ఇదే ప్రయాణ సాధనం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని