Spy Satellite: కక్ష్యలోకి దక్షిణ కొరియా రెండో నిఘా ఉపగ్రహం

Spy Satellite: గత డిసెంబరులో తొలి సైనిక గూఢచార ఉపగ్రహాన్ని ప్రయోగించిన దక్షిణ కొరియా తాజాగా రెండోదాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

Published : 08 Apr 2024 09:21 IST

సియోల్‌: దేశీయంగా తయారు చేసిన రెండో నిఘా ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు దక్షిణ కొరియా (South Korea) ప్రకటించింది. అమెరికాలోని వాండెన్‌బర్గ్‌ అంతరిక్ష స్థావరం నుంచి స్పేస్‌ ఎక్స్‌ కంపెనీకి చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ ద్వారా సోమవారం ఈ ప్రయోగం జరిగినట్లు వెల్లడించింది. విజయవంతంగా కక్ష్యలోకి చేరిన ఈ ఉపగ్రహం (Spy Satellite ) పనితీరు ఎలా ఉందో అక్కడి నుంచి వస్తున్న సంకేతాల ద్వారా ధ్రువీకరించుకుంటున్నట్లు తెలిపింది. 

సైనిక నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించినట్లు ఉత్తర కొరియా గత నవంబరులో ప్రకటించింది. ఆ తర్వాత వారం రోజులకే దక్షిణ కొరియా తన ప్రప్రథమ సైనిక గూఢచార ఉపగ్రహాన్ని (Spy Satellite) కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 2025 వరకు మొత్తం అయిదు ఉపగ్రహాలను పంపాలన్నది ఆ దేశ లక్ష్యం. దీంతో ఇరు దేశాల మధ్య వైరం అంతరిక్షంలోకీ చేరినట్లయింది. సియోల్‌ ప్రయోగించిన తొలి ఉపగ్రహం సెంట్రల్‌ ప్యాంగ్యాంగ్‌కు సంబంధించిన స్పష్టమైన చిత్రాలను పంపింది. జూన్‌ నుంచి అది పూర్తిస్థాయి కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఐదు ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరితే ఉత్తర కొరియాలోని ప్రధాన స్థావరాలన్నింటిపై నిఘా వేసే అవకాశం లభిస్తుంది. ప్రతి రెండు గంటలకు ఒకసారి ఆయా ప్రదేశాలకు సంబంధించిన చిత్రాలు అందుతాయని సియోల్‌ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

మరోవైపు తమ నిఘా ఉపగ్రహం అమెరికాలోని కీలక నావికాస్థావరాల చిత్రాలను పంపినట్లు ఉత్తర కొరియా గతంలో తెలిపింది. అలాగే దక్షిణ కొరియాలోని ప్రముఖ ప్రదేశాల ఫొటోలు సైతం తమకు అందినట్లు పేర్కొంది. ఉత్తర కొరియాకు రష్యా నుంచి మద్దతు లభించినట్లు సియోల్‌ ఆరోపిస్తోంది. దక్షిణ కొరియా తమ ప్రధాన శత్రువని ప్యాంగ్యాంగ్‌ వర్గాలు ఈ ఏడాది ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని