South Korea: వివాహాలపై అనాసక్తి.. దక్షిణ కొరియా కొత్త ప్రయోగం!

దేశంలో తగ్గిపోతోన్న వివాహాలు, శిశు జననాల సమస్యను పరిష్కరించేందుకు దక్షిణ కొరియా కొత్త పథకాన్ని ప్రవేశపెడుతోంది. ఇంటి పనుల్లో విదేశీ సహాయకులను అనుమతించనుంది.

Published : 02 Sep 2023 18:07 IST

సియోల్‌: ఒకవైపు పెరిగిపోతోన్న వృద్ధ జనాభా.. మరోవైపు తగ్గిపోతోన్న వివాహాలు, శిశు జననాలతో దక్షిణ కొరియా (South Korea) సతమతమవుతోంది. పెళ్లిళ్లు, పిల్లలను కనడంపై యువత ఆసక్తి చూపడం లేదని గుర్తించింది. ఈ క్రమంలోనే సమస్యకు పరిష్కారంగా ఓ పైలట్‌ ప్రాజెక్టును ప్రకటించింది. పిల్లల సంరక్షణతోపాటు ప్రజలపై ఇంటిపనుల ఒత్తిడి తగ్గించేలా.. వారికి చేదోడుగా ఉండేందుకు విదేశీ సహాయకుల (Housekeepers)ను అనుమతించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాజధాని సియోల్‌లోని ఇళ్లలో పనిచేసేందుకు తొలుత 100 మందిని అనుమతించనుంది. డిసెంబరు నాటికి ఇది మొదలవుతుంది. క్రమక్రమంగా పరిశ్రమలు, సంస్థలకూ విస్తరించాలనే ఆలోచనలో ఉంది.

వివాహాలపై అనాసక్తి, జననాల తగ్గుదలపై ప్రభుత్వం ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. 19 నుంచి 34 ఏళ్లలోపు వారిలో సగానికిపైగా మంది.. వివాహం తర్వాత కూడా పిల్లలను కనాల్సిన అవసరం లేదని చెప్పారు. మరోవైపు.. కేవలం 36.4 శాతం మంది మాత్రమే తమకు వివాహం పట్ల సానుకూల దృక్పథం ఉందన్నారు. ఆర్థిక ఇబ్బందులు, గృహభారం, చిన్నారుల సంరక్షణ తదితర సమస్యలను ఉటంకించారు. ఈ క్రమంలోనే పిల్లల సంరక్షణతోపాటు ఇంటిపనుల భారం తగ్గించేందుకు ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు సిద్ధమైంది. 20 నుంచి 40 ఏళ్లలోపు వయసున్న, ఇద్దరూ సంపాదిస్తోన్న జంటలతోపాటు సింగిల్‌ పేరెంట్‌, ఎక్కువ మంది పిల్లలున్న కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వనుంది.

జాబిల్లి ఉపరితలంపై.. ‘సెంచరీ’ కొట్టిన రోవర్‌!

విదేశీ సహాయకుల కనీస వయసు 24 ఏళ్లు ఉండాలని అధికారులు చెప్పారు. వారి నేర, మాదక ద్రవ్యాల చరిత్రపై ఆరా తీయనున్నారు. పని అనుభవం, విషయ పరిజ్ఞానం, ఆయా భాషలపై పట్టునూ పరిశీలిస్తారు. విశ్వసనీయ ఏజెన్సీల ద్వారా వారిని స్థానికుల ఇళ్లలో పనులకు అనుమతిస్తారు. ఇలా.. ఆరు నెలలపాటు ఈ ప్రాజెక్టును పర్యవేక్షించనున్నారు. ఇదిలా ఉండగా.. దక్షిణ కొరియా ప్రస్తుత జనాభా దాదాపు 5.17 కోట్లు. ఇప్పటికే దేశాన్ని జనాభా సంక్షోభం వేధిస్తోంది. తయారీ, వ్యవసాయ రంగాల్లో కార్మికుల కొరతతో చాలా కాలంగా సమస్యలు ఏర్పడుతున్నాయి. ఒకదశలో కార్మికుల పనిగంటలను వారానికి 52 నుంచి 69కి పెంచింది. అయితే, పెద్దఎత్తున నిరసనలు రావడంతో వెనక్కు తగ్గింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని