Chandrayaan-3: జాబిల్లి ఉపరితలంపై.. ‘సెంచరీ’ కొట్టిన రోవర్‌!

జాబిల్లిపై ప్రజ్ఞాన్‌ రోవర్‌ ‘సెంచరీ’ కొట్టింది. ఇది ల్యాండర్‌ నుంచి ఇప్పటివరకు 100 మీటర్లకుపైగా దూరం ప్రయాణించినట్లు ‘ఇస్రో’ ట్వీట్‌ చేసింది.

Published : 02 Sep 2023 14:21 IST

బెంగళూరు: చంద్రయాన్‌ 3 (Chandrayaan 3) మిషన్‌కు సంబంధించిన విక్రమ్‌ ల్యాండర్‌, రోవర్‌ ప్రస్తుతం జాబిల్లిపై తమ పరిశోధనలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రుడిపై ఉపరితలంపై కదులుతున్న రోవర్‌ (Pragyan Rover).. ల్యాండర్‌ నుంచి ఇప్పటివరకు 100 మీటర్లకుపైగా దూరం ప్రయాణించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) వెల్లడించింది. ఇది మరింత ముందుకు వెళ్తున్నట్లు తెలిపింది. రోవర్‌ ప్రయాణించిన మార్గానికి సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో పోస్టు చేసింది. ప్రజ్ఞాన్‌ రోవర్‌ సెంచరీ కొట్టినట్లు సరదాగా రాసుకొచ్చింది.

నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య-ఎల్‌1

మరోవైపు.. చంద్రుడిపై ఒక్క పగలు (14 రోజులు) గడువు సమీపిస్తుండటంతో ఇస్రో అప్రమత్తమైంది. రాత్రిని తట్టుకునేందుకు వీలుగా రోవర్‌, ల్యాండర్‌లను నిద్రాణ స్థితిలో చేర్చే ప్రక్రియ రానున్న ఒకట్రెండు రోజుల్లో ప్రారంభమవుతుందని ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ చెప్పారు. విక్రమ్‌, ప్రజ్ఞాన్‌ ప్రస్తుతం అనుకున్న విధంగానే పనిచేస్తున్నాయని, వాటిలోని పేలోడ్‌లు జాబిల్లిపై విస్తృతంగా పరిశోధనలు సాగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల వివరాలు, సల్ఫర్‌ వంటి మూలకాల లభ్యత, ప్రకంపనలు వంటి సమాచారాన్ని చేరవేసిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు