Golden Crown: ట్రంప్‌నకు బంగారు కిరీటం.. సిద్ధం చేసిన దక్షిణ కొరియా

Eenadu icon
By International News Team Updated : 29 Oct 2025 12:01 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (US President Donald Trump)నకు దక్షిణ కొరియా (South Korea) అరుదైన గౌరవం ఇవ్వనుంది. ట్రంప్‌నకు దక్షిణ కొరియా అత్యున్నత అవార్డు గ్రాండ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ముగుంగ్వా, చియోన్మాచాంగ్‌ నకలు బంగారు కిరీటం ప్రదానం చేయడానికి సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ట్రంప్‌ ఇప్పటికే దక్షిణ కొరియాకు చేరుకున్నారు. బుధవారం గ్యోంగ్జు నేషనల్ మ్యూజియంను సందర్శించనున్న నేపథ్యంలో అక్కడ అమెరికా అధ్యక్షుడికి దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్‌ (South Korean President Lee Jae Myung) బంగారు కిరీటం (Golden Crown) నకలును బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.  

కొరియా ద్వీపకల్పంలో సుదీర్ఘకాలం శాంతిని స్థాపించిన సిల్లా చరిత్రకు ప్రతీకగా ఈ బంగారు కిరీటాన్ని ఇస్తారని దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ప్రపంచ దేశాల్లో శాంతిని నెలకొల్పడానికి ట్రంప్‌ చేస్తున్న అవిశ్రాంత ప్రయత్నాలకు గుర్తింపుగా ఈ అత్యున్నత అవార్డును ఆయనకు ప్రదానం చేస్తున్నట్లు పేర్కొంది. 

మలేసియా, జపాన్‌లలో పర్యటన ముగించుకున్న ట్రంప్‌ దక్షిణ కొరియా చేరుకున్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్‌తో ఆయన ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు జరపనున్నారు. అమెరికా విధించిన సుంకాలు, అంతర్జాతీయ పరిస్థితులపైనా వీరు చర్చించుకోనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా లీ జే-మ్యుంగ్‌ అమెరికా అధ్యక్షుడి కోసం ప్రత్యేకమైన విందును కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ విందుకు వియత్నాం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, థాయ్‌లాండ్, సింగపూర్ నేతలు హాజరవ్వనున్నారు.

ట్రంప్‌ మంగళవారం జపాన్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రధాని సనాయె తకాయిచి ఆయనను నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్‌ చేస్తానని హామీ ఇచ్చారు. థాయ్‌లాండ్‌-కంబోడియాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో ట్రంప్ విజయం సాధించారని.. ఇక, పశ్చిమాసియాలో కుదిర్చిన ఒప్పందం (ఇజ్రాయెల్‌-హమాస్‌) చరిత్రాత్మకమైందని కొనియాడారు.

Tags :
Published : 29 Oct 2025 10:16 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని