South Korea: భారీ సంఖ్యలో జూనియర్‌ డాక్టర్లపై వేటు వేయనున్న ద.కొరియా

దక్షిణ కొరియాలో వైద్యులు, ప్రభుత్వం మధ్య విభేదాలు ముదురుతున్నాయి. వారు సమ్మెను వీడి విధుల్లో చేరకపోతే చర్యలు తప్పవని నేడు ఆ దేశ ఆరోగ్యశాఖా మంత్రి తేల్చి చెప్పారు. 

Published : 04 Mar 2024 15:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రెండు వారాల నుంచి సమ్మె చేస్తున్న దాదాపు 9,000 మందికి పైగా జూనియర్‌ వైద్యులపై చర్యలు తీసుకొనేందుకు దక్షిణ కొరియా (South Korea) రంగం సిద్ధం చేస్తోంది. వీరి ఆందోళన కారణంగా వేలాది ఆపరేషన్లు నిలిచిపోయాయి. సమ్మెను ఆపి తక్షణమే విధుల్లో చేరాలని.. లేకపోతే చర్యలు తప్పవని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి చో క్యోహాంగ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ సిబ్బంది ఆస్పత్రులకు వెళ్లి తనిఖీలు చేస్తారన్నారు. విధుల్లో ఎవరైనా చేరకపోతే మరో ఆలోచన లేకుండా చర్యలు తీసుకొంటారని చెప్పారు. వారి కెరీర్‌లు కూడా చిక్కుల్లో పడతాయని పేర్కొన్నారు. 

గడ్డకట్టిన కాలిఫోర్నియా.. జనజీవనానికి ఆటంకం

దేశంలోని మొత్తం 1.4 లక్షల మంది వైద్యుల్లో ఒక సంఘం వారు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ప్రధాన వైద్యశాలల్లోని డాక్టర్ల సంఖ్యలో వీరు 40శాతం వరకు ఉంటారు. ఆదివారం కూడా కొరియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వేల మంది వైద్యులు రాజధాని సియోల్‌లో ర్యాలీ చేశారు. ఈ సంఘం దేశంలోని ప్రైవేటు వైద్యులకు ప్రాతినిధ్యం వహిస్తుంది.

అసలు సమస్య ఏమిటీ..?

కొరియాలో దీర్ఘకాలంగా ఉన్న డాక్టర్ల కొరతను తీర్చేందుకు మరింతమందికి వైద్య విద్యలో అవకాశం కల్పించాలని ప్రభుత్వం ఫిబ్రవరిలో నిర్ణయించింది. మెడికల్‌ స్కూల్స్‌లో సీట్లను గణనీయంగా పెంచింది. దీనిని జూనియర్‌, రెసిడెంట్‌ డాక్టర్లు సహా ఇతర సిబ్బంది వ్యతిరేకించారు. వేల మంది జూనియర్‌ డాక్టర్లు విధులను బహిష్కరించారు. తొలుత పని ప్రదేశాల్లోని పరిస్థితులను మెరుగుపర్చాలని వారు కోరుతున్నారు. దీనిపై వీధుల్లో ఆందోళన మొదలుపెట్టారు. అవసరమైతే ఉద్యోగాలను వదిలేస్తామని హెచ్చరించారు. వీరికి సీనియర్లు, ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. కానీ, ప్రభుత్వం మాత్రం దిగి రాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని