Bedbugs: నిద్రలేకుండా చేస్తున్న నల్లులు.. యుద్ధం ప్రకటించిన దక్షిణ కొరియా!

దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, యూనివర్సిటీలు, హోటళ్లు, నివాస ప్రాంతాల్లో నల్లుల వ్యాప్తి విపరీతంగా పెరగడంతో హై అలర్ట్‌ ప్రకటించిన దక్షిణ కొరియా ప్రభుత్వం.. నల్లులపై యుద్ధం ప్రకటించింది.

Updated : 10 Nov 2023 20:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పలు యూరప్‌ దేశాలతోపాటు అమెరికానూ వెంటాడుతున్న నల్లుల (Bedbugs) బెడద తాజాగా దక్షిణ కొరియాను (South Korea) తాకింది. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, యూనివర్సిటీలు, నివాస ప్రాంతాల్లో నల్లుల వ్యాప్తి విపరీతంగా పెరిగింది. దీంతో హై అలర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం.. నల్లులపై యుద్ధం ప్రకటించింది. రక్తాన్ని పీల్చే ఈ పురుగుల బారి నుంచి తప్పించుకునేందుకు అత్యవసరమైతే తప్ప ప్రజా రవాణా, సినిమా హాళ్ల వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించింది. అంతేకాకుండా నల్లుల తీవ్రత అధికంగా ఉన్న ఫ్రాన్స్‌, బ్రిటన్‌ దేశాల నుంచే వచ్చే ప్రయాణికులు వారి వస్తువులను పూర్తిగా శానిటైజ్‌ చేయాలని దక్షిణ కొరియా వ్యాధి నియంత్రణ కేంద్రం (CDC) స్పష్టం చేసింది.

దక్షిణ కొరియా గతంలోనూ నల్లుల బెడదను ఎదుర్కొంది. 2014లో తొమ్మిదిచోట్ల ఈ వ్యాప్తిని గుర్తించిన ప్రభుత్వం.. కొన్ని రోజుల్లోనే దాన్ని నిర్మూలించింది. ఇటీవల పారిస్‌, బ్రిటన్‌లతోపాటు అమెరికాలోనూ కేసులు పెరుగుతున్న తరుణంలో దక్షిణ కొరియాలో మళ్లీ వీటి వ్యాప్తి మొదలయ్యింది. అక్టోబర్‌ చివరి వారంలోనే 30 జనసమూహ ప్రాంతాల్లో నల్లుల వ్యాప్తిని గుర్తించారు. ఇవే కాకుండా స్థానికంగా నివాస ప్రాంతాల్లో వీటితో ఇక్కట్లు పడుతున్నామనంటూ వందల సంఖ్యలో దక్షిణ కొరియా పౌరులు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. చర్యలు చేపట్టింది.

ఇజ్రాయెల్‌ యుద్ధం వేళ.. మరణించిన సైనికుల ‘వీర్యం’ సేకరిస్తున్న కుటుంబీకులు!

పర్యాటకులు తాకిడి ఎక్కువగా ఉండే దక్షిణ కొరియాలో నల్లుల వ్యాప్తి నిర్మూలన కోసం నడుం బిగించిన ప్రభుత్వం.. నాలుగు వారాలపాటు ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టింది. ఇవి వ్యాధిని వ్యాప్తి చేయనప్పటికీ దురద కారణంగా చర్మ ఇన్‌ఫెక్షన్లకు దారితీయనుండటంతో పౌరులకు పలు సూచనలు చేసింది. టూరిస్టు హోటళ్లు, సినిమా హాళ్లుకు పౌరులు దూరంగా ఉండాలని సూచించింది. 3 వేల ప్రభుత్వ టాయిలెట్ల శుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. నల్లుల తీవ్రత ఉన్నచోట క్రిమిసంహారక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. నివాస ప్రాంతాల్లోనే వీటి తీవ్రత ఉంటే అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపింది. ఇలా నల్లుల నిర్మూలన చర్యలు చేపడుతున్నప్పటికీ.. రానున్న రోజుల్లో వీటి బెడద మరింత పెరిగే ప్రమాదం ఉందని దక్షిణ కొరియా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని