South Korea: భగ్గుమన్న కొరియా ద్వీపకల్పం.. సైనిక డీల్‌ను సస్పెండ్‌ చేసిన సియోల్‌

కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఉ.కొరియా (North Korea) ఉపగ్రహ ప్రయోగానికి ప్రతిగా దక్షిణ కొరియా (South Korea) ఓ సైనిక ఒప్పందాన్ని ఉల్లంఘించాలని నిర్ణయించింది.

Published : 22 Nov 2023 16:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తర కొరియా (North Korea) నిఘా ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ఉద్రిక్తతలను రాజేసింది. దీనికి ప్రతిగా 2018లో తాము ఉత్తరకొరియాతో చేసుకొన్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తామని దక్షిణ కొరియా ప్రకటించింది. ఈ అంశాన్ని దక్షిణ కొరియా  (South Korea) ప్రధాని హాన్‌ డక్‌ సూ వెల్లడించారు. ఇకపై తమ దేశ నిఘా విమానాలు తిరిగి సరిహద్దుల్లోని నోఫ్లై జోన్‌లో ఎగురుతాయని ప్రకటించారు. 

ఇక ఉత్తరకొరియా ఎటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించిందనే విషయాన్ని తాము ఇంకా విశ్లేషించలేదని దక్షిణ కొరియా, అమెరికా వెల్లడించాయి. అసలు ఈ ప్రయోగం విజయవంతమైందో లేదో కూడా తెలియదని పేర్కొన్నారు. దీనిపై అమెరికా నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సభ్యుడు వాట్సన్‌ మాట్లాడుతూ ‘‘ఈ ప్రాంతం భద్రతా పరిస్థితిని అస్థిర పర్చే చర్య’’ అని పేర్కొన్నారు. 

ఉత్తర కొరియా ఐదేళ్ల మిలటరీ ప్లాన్‌లో నిఘా ఉపగ్రహ ప్రయోగం కీలకమైన అంశం. ఈ ప్లాన్‌ను 2021లో కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆవిష్కరించారు. తాజాగా అందిన నిఘా టెక్నాలజీతో అమెరికా, దక్షిణ కొరియా దేశాల సైన్యం కదలికలపై ఉత్తరకొరియా నిఘా పెట్టే అవకాశాలున్నాయి. అంతేకాదు.. ఉ.కొరియా అణ్వాయుధాలను కచ్చితత్వంతో ప్రయోగించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. దీనిపై ఆ దేశ స్పేస్‌ ఏజెన్సీ నేషన్‌ ఏరోస్పేస్‌ టెక్నాలజీ అడ్మినిస్ట్రేషన్‌ సంస్థ స్పందిస్తూ.. ఈ ప్రయోగంతో దేశ ఆత్మరక్షణ సామర్థ్యం పెరిగిందని అభివర్ణించింది. మరిన్ని నిఘా ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపుతామని పేర్కొంది.

తొలిసారిగా నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఉత్తర కొరియా

తొలిసారిగా ఉ.కొరియా నిఘా ఉపగ్రహాన్ని భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా, జపాన్‌ నిర్థరించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ ఉపగ్రహం రూపకల్పనలో రష్యా నుంచి ఉత్తరకొరియా సాంకేతిక సహకారం తీసుకున్నట్లు సమాచారం. కొరియా ద్వీపకల్పం, చైనా మధ్య ఉన్న సముద్రం మీదుగా ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లిందని దక్షిణ కొరియా సైనికాధికారులు తెలిపారు. ఈ రాకెట్‌ శకలాలు ఆసియా భూభాగంలోనే పడే అవకాశాలున్నాయన్నారు. గతంలో రెండు సార్లు నిఘా ఉపగ్రహాన్ని భూకక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు కిమ్‌ ప్రభుత్వం విఫలయత్నం చేసింది. ఈ సారి రష్యా సహకారంతో ప్రయోగాన్ని విజయవంతం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని