India- China: భారత్‌ మాతో కలిసి రావాలి.. మోదీ వ్యాఖ్యలపై చైనా

భారత్‌- చైనా మధ్య సత్సంబంధాలు ఇరుదేశాల ఉమ్మడి ప్రయోజనాలకు మేలు కలిగిస్తాయని చైనా విదేశాంగశాఖ తెలిపింది.

Published : 11 Apr 2024 16:40 IST

బీజింగ్‌: భారత్‌, చైనాల మధ్య స్థిరమైన, శాంతియుత సంబంధాలు (India China Ties) ఈ ప్రాంతానికే కాదు, ప్రపంచానికీ కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్న విషయం తెలిసిందే. మోదీ వ్యాఖ్యలపై చైనా (China) స్పందిస్తూ.. స్థిరమైన, సత్సంబంధాలు ఇరుదేశాల ఉమ్మడి ప్రయోజనాలకు మేలు చేకూరుస్తాయని తెలిపింది. సరిహద్దు సమస్య అనేది రెండింటి మధ్య ఉన్న పూర్తి సంబంధాలను ప్రతిబింబించదని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావో నింగ్‌ పేర్కొన్నారు.

‘‘ప్రధాని మోదీ వ్యాఖ్యలను గుర్తించాం. ఇరుదేశాల మధ్య మంచి, స్థిరమైన సంబంధాలు.. ఉమ్మడి ప్రయోజనాలకు, ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా శాంతిస్థాపన, అభివృద్ధికి దోహదపడతాయి. సరిహద్దు వివాదాన్ని సరైన రీతిలో పరిష్కరించుకోవాలి. దౌత్య, సైనిక మార్గాల్లో ఇరుపక్షాలు ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నాయి. వ్యూహాత్మక, దీర్ఘకాలిక కోణంలో ద్వైపాక్షిక సంబంధాల నిర్వహణ, పరస్పర విశ్వాసం, సహకారం, సంప్రదింపులు, విభేదాల పరిష్కారం విషయంలో మాతో భారత్‌ కలిసివస్తుందని ఆశిస్తున్నాం’’ అని మావో నింగ్‌ తెలిపారు.

చైనాతో సంబంధాలు మాకు కీలకం: ప్రధాని మోదీ

చైనాతో సంబంధాలు భారత్‌కు చాలా ముఖ్యమని న్యూయార్క్‌కు చెందిన ‘న్యూస్‌ వీక్‌’ మేగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ తెలిపారు. సరిహద్దు అంశంలో ఇరుదేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన.. దౌత్య, సైనిక స్థాయిల్లో సానుకూల, నిర్మాణాత్మక చర్చల ద్వారా పరిష్కారం అవుతుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు. 2020లో తూర్పు లద్ధాఖ్‌లో సైనిక ఘర్షణ తర్వాత భారత్‌- చైనా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సరిహద్దు ప్రతిష్టంభన పరిష్కారానికి ఇరుపక్షాలు ఇప్పటివరకు 21 రౌండ్ల కోర్‌ కమాండర్ స్థాయి చర్చలు నిర్వహించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని