India-Pakistan: ఉపన్యాసాలొద్దు.. మీ ఉగ్ర ఫ్యాక్టరీలను మూసేయండి: పాక్‌ను ఎండగట్టిన భారత్‌

India-Pakistan: ప్రజాస్వామ్యంపై పాకిస్థాన్‌ పాఠాలు చెప్పడం హాస్యాస్పదమని భారత్‌ దుయ్యబట్టింది. ఉగ్ర ఫ్యాక్టరీలను ఆపడంపై ఆ దేశం దృష్టిపెట్టాలని సూచించింది.

Published : 25 Mar 2024 12:16 IST

దిల్లీ: అంతర్జాతీయ వేదికగా భారత్‌ (India)ను తప్పుబట్టాలని ప్రయత్నించిన పాకిస్థాన్‌ (Pakistan)కు మరోసారి భంగపాటు తప్పలేదు. ప్రజాస్వామ్యం, మానవహక్కులపై హితోపదేశాలు ఇచ్చిన దాయాదిని న్యూదిల్లీ ఎండగట్టింది. తమకు ఉపన్యాసాలు ఇచ్చే పని మానుకుని.. సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న ఉగ్ర ఫ్యాక్టరీలను మూసివేయడంపై దృష్టిపెట్టాలని గట్టిగా బుద్ధిచెప్పింది.

స్విట్జర్లాండ్‌లోని జెనీవా వేదికగా ఇంటర్‌-పార్లమెంటరీ యూనియన్‌ (ఐపీయూ) 148వ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాకిస్థాన్‌ ప్రతినిధి మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు. ఈ సమావేశంలో భారత్‌ తరఫున పాల్గొన్న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌.. ‘రైట్‌ టు రిప్లై’ అవకాశం కింద స్పందిస్తూ పాక్‌ను కడిగిపారేశారు.

ఉగ్రవాది.. ఏ భాషలోనైనా ఉగ్రవాదే: జైశంకర్‌

‘‘ప్రజాస్వామ్యం అమలులో అధ్వాన్నమైన రికార్డు కలిగిన ఆ దేశం (పాకిస్థాన్‌) ఉపన్యాసాలు ఇవ్వడం నవ్వుతెప్పిస్తోంది. ఇలాంటి అసంబద్ధ ఆరోపణలు, తప్పుడు కథనాలతో ఐపీయూ లాంటి ప్రపంచ వేదిక ప్రతిష్ఠను దెబ్బతీయకూడదు. జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ ఎప్పటికీ భారత్‌లో ఎప్పటికీ అంతర్భాగమే. ఇలాంటి అవాస్తవ ప్రచారాలతో ఈ వాస్తవాన్ని ఎవరూ మార్చలేరు’’ అని హరివంశ్‌ దాయాదిపై మండిపడ్డారు.

‘‘ఒసామా బిన్‌ లాడెన్‌ వంటి అంతర్జాతీయ ఉగ్రవాది ఎక్కడ దొరికాడో గుర్తుచేసుకుందాం. ఐరాస ఉగ్రవాదులుగా గుర్తించిన ఎంతో మందికి ఆతిథ్యమిచ్చిన దేశంగా పాక్‌ అవమానకర రికార్డ్‌ను కలిగి ఉంది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, వారి కార్యకలాపాలకు ఆర్థికంగా అండగా ఉన్న చరిత్ర దానిది. ఇకనైనా పాక్‌ తమ ప్రజల మేలు కోసం గుణపాఠం నేర్చుకోవాలి. జమ్మూకశ్మీర్‌లో సీమాంతర దాడులకు పాల్పడుతున్న ఉగ్ర ఫ్యాక్టరీలను మూసివేసేందుకు ప్రయత్నించాలి’’ అని భారత్‌ హితవు పలికింది.

అంతర్జాతీయ వేదికలపై పాక్‌ ఇలా జమ్మూకశ్మీర్‌ ప్రస్తావన తీసుకురావడం ఇదే తొలిసారి కాదు. ఐరాస వంటి సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తేందుకు ప్రయత్నించగా.. భారత్‌ ప్రతిసారీ దీటుగా బదులిచ్చింది. ఆ దేశం ఉగ్ర ఆగడాలను ప్రపంచం ముందు ఎండగట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని