Mexico: ఈదురుగాలులతో కుప్పకూలిన ప్రచార వేదిక.. 9 మంది మృతి

ఈదురు గాలులు బలంగా వీయడంతో మెక్సికోలో ఓ ప్రచార వేదిక కుప్పకూలింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

Published : 23 May 2024 17:16 IST

మెక్సికో సిటీ: మెక్సికో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. బలంగా ఈదురుగాలులు వీయడంతో ఓ ప్రచార వేదిక కుప్పకూలింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. ఈ ఘటన ఉత్తర మెక్సికో (northern Mexico)లోని న్యూవో లియోన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే..

త్వరలో మెక్సికోలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే అధ్యక్ష అభ్యర్థి జార్జ్ అల్వారెజ్ మేనెజ్ ప్రచారంలో పాల్గొన్నారు. అంతలోనే ఈదురుగాలులు వీచాయి. బలమైన గాలులకు స్టేజీ కూలిపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. 63 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉండడం బాధాకరం. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా విషాదకరంగా మారింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

మహిళా సైనికులపై చిత్రహింసలు.. వెలుగులోకి హమాస్‌ ఉగ్రవాదుల క్రూరత్వం!

వెంటనే స్పందించిన పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి. అభ్యర్థి జార్జ్‌కు స్వల్పంగా గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రతికూల వాతావరణం దృష్ట్యా కొన్ని రోజుల పాటు ప్రచారాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై మెక్సికన్‌ అధ్యక్షుడు ఆండ్రెస్‌ మాన్యుయెల్‌ విచారం వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని