‘అమెరికాలో హిందువులపై దాడులు పెరిగాయ్‌’ - చట్టసభ సభ్యుల ఆందోళన

అమెరికాలో హిందువులు, హిందూ ప్రార్థనా స్థలాలపై దాడులు గణనీయంగా పెరిగాయని ఇండో-అమెరికన్‌ చట్టసభ సభ్యుడు శ్రీ తానేదార్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Updated : 16 Apr 2024 15:44 IST

వాషింగ్టన్‌: అమెరికాలో (USA) ఇటీవల కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అక్కడ హిందువులు, హిందూ ప్రార్థనా స్థలాలపై దాడులు గణనీయంగా పెరిగాయని ఇండో-అమెరికన్‌ చట్టసభ సభ్యుడు ఆందోళన వ్యక్తంచేశారు. హిందువులకు వ్యతిరేకంగా సమన్వయంతోనే ఈ తరహా దాడులు జరుగుతున్నాయని, ఇది ఆరంభం మాత్రమేనని చట్టసభ సభ్యుడు శ్రీ తానేదార్‌ (Shri Thanedar) హెచ్చరించారు.

‘అమెరికాలో నేడు హిందువులపై దాడులు గణనీయంగా పెరగడాన్ని చూస్తున్నా. ఆన్‌లైన్‌లో, మరోవిధంగా భారీ స్థాయిలో అసత్య ప్రచారం సాగుతోంది. సమన్వయంతో ఈ తరహా దాడులు జరుగుతున్నాయని అనిపిస్తోంది. దీనికి వ్యతిరేకంగా కలసికట్టుగా ముందుకుసాగాలి. సమయం ఆసన్నమైంది. ఇందుకు నా మద్దతు ఉంటుంది’ అని నేషనల్‌ ప్రెస్‌క్లబ్‌లో హిందూయాక్షన్‌ అనే స్వచ్ఛందసంస్థ ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తానేదార్‌ పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా దాడులకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకపోవడంతోపాటు ఇప్పటికీ ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు.

ఏ దేశమేగినా.. ‘అధినేతలు మనవాళ్లే!’

కాలిఫోర్నియా, న్యూయార్క్‌తో సహా అమెరికా వ్యాప్తంగా ఇలాంటి దాడులు చూస్తున్నామని తానేదార్‌ పేర్కొన్నారు. స్థానిక దర్యాప్తు సంస్థలు విచారణ మొదలుపెడుతున్నప్పటికీ వాటిపై పురోగతి ఉండటం లేదని ఆరోపించారు. ఈనేపథ్యంలో స్థానిక పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ (FBI)తోపాటు న్యాయశాఖ కలిసి సమన్వయంతో ముందుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇలా హిందూ ప్రార్థనా మందిరాలపై పెరుగుతోన్న దాడులపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరుతూ తనతో సహా రోఖన్నా, రాజా కృష్ణమూర్తి, అమీబెరా, ప్రమీలా జయపాల్‌ (ఇండో అమెరికన్‌ చట్టసభ సభ్యులు).. యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌కు ఇటీవల లేఖ రాశామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని