ఏ దేశమేగినా.. ‘అధినేతలు మనవాళ్లే!’

విశ్వగురుగా పేరొందిన భారతావని ప్రపంచ రాజకీయాల్లో సైతం తన ముద్ర వేస్తోంది. భారతీయ మూలాలున్న నేతలు అనేక దేశాల్లో కీలక పదవులను అధిరోహిస్తున్నారు.

Updated : 03 Sep 2023 06:41 IST

సింగపూర్‌ అధ్యక్ష పీఠంపై షణ్ముగరత్నం
ప్రపంచవ్యాప్తంగా రాజకీయాల్లో భారతీయ మూలాలున్న వ్యక్తులు

సింగపూర్‌: విశ్వగురుగా పేరొందిన భారతావని ప్రపంచ రాజకీయాల్లో సైతం తన ముద్ర వేస్తోంది. భారతీయ మూలాలున్న నేతలు అనేక దేశాల్లో కీలక పదవులను అధిరోహిస్తున్నారు. తాజాగా సింగపూర్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన థర్మన్‌ షణ్ముగరత్నం ఆ జాబితాలో చేరారు. 66 ఏళ్ల షణ్ముగరత్నంకు 70.4 శాతం ఓట్లతో సింగపూర్‌ ప్రజలు బ్రహ్మరథం పట్టడం విశేషం. 2020 నుంచి సింగపూర్‌ ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న ప్రీతమ్‌ సింగ్‌ కూడా భారతీయ మూలాలున్న న్యాయవాది, రచయిత కూడా! ఇప్పటికే భారత సంతతి నేతలు అమెరికా సహా అనేక దేశాల్లో కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌.... తాజాగా ఆ దేశ అధ్యక్ష పదవిపై కన్నేసి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న వివేక్‌ రామస్వామి కూడా భారతీయ మూలాలున్న వారే. వివేక్‌ తల్లిదండ్రులు కేరళ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. ఆయనకు పోటీగా రంగంలో ఉన్న... నికీ హేలీ కూడా భారత సంతతికి చెందిన నేతే! అమెరికా పార్లమెంటులోనైతే చాలామంది మన వాళ్లున్నారు. రాజా కృష్ణమూర్తి, రోఖన్నా, ప్రమీలా జయపాల్‌, అమీ బెరా, తానేదార్‌లు ఇటీవలే మధ్యంతర ఎన్నికల్లో అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. రిపబ్లికన్‌ నేషనల్‌ కమిటీ (ఆర్‌ఎన్‌సీ) ఛైర్మన్‌ పదవికి కాలిఫోర్నియాకు చెందిన హర్మీత్‌ థిల్లాన్‌ పోటీ పడ్డారు.

ఆ దేశ ప్రధానులూ...

ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యంగా వెలిగి... మనల్ని ఏలిన బ్రిటన్‌కు ఇప్పుడు మన వాడైన రిషి సునాక్‌ ప్రధాన మంత్రిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే! బ్రిటన్‌ను పాలిస్తున్న తొలి భారత సంతతి రాజకీయ నాయకుడే కాకుండా... 210 సంవత్సరాల్లో అత్యంత పిన్నవయస్కుడైన ఇంగ్లాండ్‌ ప్రధానిగా కూడా సునాక్‌ చరిత్ర సృష్టించారు. ఆయన కేబినెట్‌లో మంత్రులుగా చేస్తున్న బ్రవర్మన్‌, క్లైరీ కౌటిన్హోలు కూడా గోవా మూలాలున్నవారే! బ్రిటన్‌కున్న ప్రాధాన్యం కారణంగా చాలా మందికి సునాక్‌ పేరు, ఆయన భారతీయ మూలాలు తెలిశాయి. కానీ ప్రపంచానికి పెద్దగా తెలియకుండా ప్రధానులుగా కొనసాగుతున్న మరో ఇద్దరు భారత సంతతివారున్నారు.

వారే... ఐర్లాండ్‌ ప్రధాని లియో ఎరిక్‌ వరాద్కర్‌! పోర్చుగల్‌ ప్రధాని ఆంటోనియో కోస్టా! వరాద్కర్‌ తండ్రి ముంబయిలో జన్మించి డాక్టర్‌గా యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు వెళ్లారు. 2015 నుంచీ పోర్చుగల్‌ ప్రధానిగా కొనసాగుతున్న ఆంటోనియో కోస్టా భారత్‌, పోర్చుగీసు మూలాలున్న వ్యక్తి.

  • కరేబియన్‌ దీవుల్లోని ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ క్రిస్టిన్‌ కార్లా కంగాలూ కూడా ఇండో-ట్రినిడాడ్‌ కుటుంబం నుంచి వచ్చారు.
  • 2017 నుంచి మారిషస్‌ ప్రధానిగా ఉన్న ప్రవింద్‌ జగన్నాథ్‌ హిందూ యదువంశ కుటుంబానికి చెందినవారు. ఆయన తాత ముత్తాతలు 1870లో ఉత్తరప్రదేశ్‌ నుంచి అక్కడికి వలస వెళ్లారు.
  • సురినామ్‌ అధ్యక్షుడు చంద్రిక ప్రసాద్‌ సంతోఖి, గయానా అధ్యక్షుడు మహమ్మద్‌ ఇర్ఫాన్‌ అలీ, సీషెల్స్‌ అధ్యక్షుడు వావెల్‌ రామకల్వాన్‌, మారిషస్‌ అధ్యక్షుడు పృథ్వీరాజ్‌సింగ్‌ రూపన్‌లూ భారతీయ మూలాలున్నవారే!
  • కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో మనవాళ్లు అనేక మంది మంత్రులుగా కొనసాగుతున్నారు.
  • 2021లో తయారు చేసిన ఓ జాబితా ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా 15 దేశాల్లో భారత సంతతి నేతలు 200 మందికిపైగా ఉన్నత పదవుల్లో ఉన్నారు. వీరిలో 60 మందికిపైగా కేబినెట్‌ మంత్రి పదవుల్లో ఉన్నట్లు తేల్చారు. భారత విదేశీవ్యవహారాల మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత సంతతి ప్రజల సంఖ్య సుమారు 3.2 కోట్లు!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని