Pakistan:: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. అయిదుగురు చైనీయులు మృతి..!

పాకిస్థాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో అయిదుగురు చైనా పౌరులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి.

Updated : 26 Mar 2024 17:59 IST

ఇస్లామాబాద్‌: చైనా జాతీయులే లక్ష్యంగా పాకిస్థాన్‌ (Pakistan)లో మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో అయిదుగురు చైనా పౌరులతోపాటు ఓ స్థానికుడు మృతి చెందాడు. పలువురికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. చైనా (China) ఇంజినీర్లతో కూడిన ఓ బస్సు ఇస్లామాబాద్‌ నుంచి ఖైబర్‌ ఫక్తుంఖ్వా ప్రావిన్స్‌లోని కోహిస్థాన్‌కు బయల్దేరింది. మార్గం మధ్యలో షాంగ్లా జిల్లాలోని బిషమ్‌ ప్రాంతంలో పేలుడు పదార్థాలతో కూడిన వాహనం ఎదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సంబంధిత ఇంజినీర్లు దాసు జలవిద్యుత్ ప్రాజెక్టులో పని చేస్తున్నట్లు సమాచారం. ఈ దాడికి ఇంకా ఏ సంస్థ కూడా బాధ్యత వహించలేదు.

నౌక ఢీకొనడంతో కుప్పకూలిన బ్రిడ్జ్‌..నదిలో పడిన కార్లు..!

సీపెక్‌ ప్రాజెక్టు, ఇతర పనుల నిమిత్తం పాకిస్థాన్‌లో వేల మంది చైనీయుల నివసిస్తున్నారు. గతంలోనూ పలు సందర్భాల్లో వారిపై దాడులు జరిగాయి. 2021లో ఓ బస్సులో పేలుడు సంభవించి, తొమ్మిదిమంది ఆ దేశానికి చెందినవారు మృతి చెందారు. ఈ ఘటనపై దర్యాప్తునకు బీజింగ్‌ అప్పట్లో ఓ బృందాన్ని కూడా పంపించింది. బాధిత కుటుంబాలకు పాకిస్థాన్‌ ప్రభుత్వం రూ.లక్షల్లో పరిహారం చెల్లించింది. గతేడాది ఆగస్టులో బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో చైనా ఇంజినీర్ల కాన్వాయ్‌పై సాయుధ తిరుగుబాటుదారులు దాడి చేశారు. 2021లో కరాచీ యూనివర్సిటీలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ముగ్గురు చైనీస్‌ టీచర్లు, పాక్‌కు చెందిన వ్యాన్‌ డ్రైవర్‌ మృతి చెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని