ఈ పర్యాటక ప్రదేశంలో సూట్‌కేసులపై నిషేధం..!

యూరప్‌లోని ఒక నగరంలో అక్కడి ప్రభుత్వం పర్యాటకుల సూట్‌కేసులపై నిషేధం విధించింది. ఒకవేళ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘింస్తే వారికి జరిమానా విధిస్తామని తెలిపింది.

Published : 01 Jul 2023 09:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్లాలనుకుంటే ముందుగా మనం టికెట్‌ ధర ఎంతుందా? అని చూస్తాం. ఆ తర్వాత మనతో పాటు ఏయే వస్తువులు తీసుకెళ్లాలో ఆలోచిస్తాం. అన్నింటిని ఎంచక్కా ఓ సూట్‌కేసులో సర్దిపెట్టుకుంటాం. ఒకవేళ యూరప్‌లోని ఈ పర్యాటక ప్రదేశానికి వెళ్లాలనుకుంటే మాత్రం సూట్‌కేసును పక్కన పెట్టాల్సిందే! లేకపోతే జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే.. అక్కడ సూట్‌కేసులు ఉపయోగించడం అక్కడ నిషేధం.

యూరప్‌లోని క్రోయేషియాలో డుబ్రోవ్నిక్‌ అనేది ఒక పర్యాటక నగరం. గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ అభిమానులు, అందమైన సూర్యోదయాన్ని చూడాలనుకునే పర్యాటకులు ఇక్కడకు అధిక సంఖ్యలో వస్తుంటారు. అంతేకాకుండా ఇది మధ్యయుగ కాలం నాటి ఇటుకలు, అందమైన రాళ్లతో నిర్మించిన కట్టడాలకు ప్రసిద్ధి. అయితే ఇటీవల ఇక్కడి ప్రభుత్వం సూట్‌కేసులపై నిషేధం విధించింది. బాంబులు లేదా స్మగ్లింగ్‌ చేస్తున్నారేమో అని అనుకుంటున్నారా? అదేం కాదు.. పర్యాటకులు అన్ని ప్రదేశాలను సందర్శిస్తూ తమ వెంట తెచ్చుకున్న సూట్‌కేసులను రోడ్లపై తీసుకువెళుతుంటే శబ్ద కాలుష్యం అవుతుందని అక్కడి ప్రజలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారట. దీంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

సూట్‌కేసు తీసుకురాకూడదన్న నిబంధనను ఎవరైనా ఉల్లంఘిస్తే 380 డాలర్ల జరిమానా కూడా విధిస్తారు. ఒక వేళ వారి వెంట సూట్‌కేసులను తెచ్చుకున్నా వాటిని భద్రపరిచేందుకు ప్రత్యేక గదిని ఏర్పాటు చేస్తామని అక్కడి మేయర్‌  మాటో ఫ్రాంకోవిక్‌ తెలిపారు. కాకపోతే దానికి కొంత రుసుము చెల్లించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా పెంపుడు జంతువులను స్వేచ్ఛగా వదిలేయడం, చొక్కా లేకుండా రోడ్లపై తిరగడం, స్మారక చిహ్నాలపై ఎక్కడం లాంటివి చేయకూడదని తెలిపారు. యూరప్‌లో ఈ సంవత్సరం చాలా మంది పర్యాటకులు సందర్శించిన నగరాల్లో డుబ్రోవ్నిక్‌ అగ్రస్థానంలో ఉంది.  దాదాపు మూడు లక్షల మంది ఈ ప్రాంతాన్ని సందర్శించి బస చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 32 శాతం ఎక్కువ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని