Rishi Sunak: ఎన్నికలకు ముందే.. రిషి సునాక్‌ రాజీనామా చేయనున్నారా?

బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలకు ముందే ప్రధాని పదవికి రిషి సునాక్‌ రాజీనామా చేయనున్నారనే ఊహాగానాలు వెల్లువెత్తాయి.

Published : 10 Jun 2024 20:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మరికొన్ని వారాల్లో బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో ప్రధాని పదవికి రిషి సునాక్‌ రాజీనామా చేయనున్నారనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. వీటిని సునాక్‌ తోసిపుచ్చారు. తన ప్రచారాన్ని ఆపే ప్రసక్తే లేదని.. చివరిరోజు వరకు కొనసాగిస్తానని స్పష్టం చేశారు. జులై 4న అక్కడ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.

ఇటీవల జరిగిన డీ-డే(D-Day) స్మారక కార్యక్రమాల నుంచి ముందస్తుగానే నిష్ర్కమించడంతో రిషి సునాక్‌పై విమర్శలు వచ్చాయి. వీటిపై ఇప్పటికే ఆయన క్షమాపణలు చెప్పారు. ఈ క్రమంలోనే సౌత్‌ ఈస్ట్‌ ఇంగ్లాండ్‌లోని ఓ కౌంటీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. దేశ భవిష్యత్తు కోసం తన పోరాటం ఆగదన్నారు. ఈసందర్భంగా ముందస్తుగా రాజీనామా చేస్తున్నారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. అలాంటిదేమీ లేదన్నారు.

దేశాన్ని ముందుకు నడిపించేందుకు అవసరమైన శక్తి తనకు ఉందన్న సునాక్‌.. ప్రజల నుంచి భారీ స్థాయిలో మద్దతు లభిస్తోందని, తన ప్రచారం ఆగదన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్‌ పార్టీ కంటే విపక్ష లేబర్‌ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ఒపీనియన్‌ పోల్స్‌ అంచనా వేయడంపైనా సునాక్‌ స్పందించారు. ప్రజలు ఏం చెప్పాలనుకుంటున్నారో మాట్లాడనీయండని అన్నారు. ఇదిలాఉంటే, వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రభుత్వానికి గడువు ఉన్నప్పటికీ.. ముందస్తు ఎన్నికలకు సునాక్‌ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని