Swiss Plane : విమానంలో 111 మంది.. అందరి లగేజీ మిస్‌!

విమానంలో (Plane) ప్రయాణిస్తున్న అందరి లగేజీ కనిపించకుండా పోయిన ఘటన స్పెయిన్‌లో (Spain) చోటు చేసుకుంది. 

Updated : 10 Sep 2023 19:51 IST

జెనీవా : విమాన ప్రయాణికులకు అప్పుడప్పుడూ చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. తోటి ప్రయాణికులు దురుసుగా ప్రవర్తించడం, విమానం ఆలస్యం కావడం, లగేజీ కనిపించకుండా పోవడం వంటి వార్తలు తరచూ వింటుంటాం. అయితే విమానంలో ప్రయాణించిన అందరి లగేజీ మిస్‌ కావడం ఎప్పుడైనా విన్నారా? అలాంటి ఘటన తాజాగా ఓ స్విట్జర్లాండ్‌ (switzerland) విమానంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌ నుంచి స్పెయిన్‌లోని (Spain) బిల్బావో నగరానికి శనివారం రాత్రి ఓ విమానం బయలుదేరాల్సి ఉంది. ఈడెల్‌వైస్‌ ఎయిర్‌లైన్స్‌ తరఫున కార్యకలాపాలు సాగిస్తున్న ఆ విమానంలో 111 మంది ప్రయాణికులు ఎక్కారు. టేకాఫ్‌ సమయం అయినా అది ఎగర్లేదు. సుమారు 1.16 గంటలు ఆలస్యమైన తరువాత విమానయాన సిబ్బంది ఒక ప్రకటన వెలువరించారు. ఆలస్యానికి చింతిస్తున్నామని చెప్పి ప్రయాణం మొదలుపెట్టారు. ఆ విమానం ఆలస్యంగా బిల్బావో చేరుకుంది. ఆ తరువాత ప్రయాణికులందరూ తమ లగేజీ కోసం కన్వేయర్‌ బెల్ట్‌ వద్దకు చేరుకున్నారు. అయితే సుమారు రెండు గంటలు గడిచినా ఎవరి సామగ్రి అక్కడకు రాలేదు.

కెనడాలో ‘ఖలిస్థానీ’ నిరసనలు.. ప్రధాని ట్రూడో ఏమన్నారంటే!

ఈ ఆలస్యంపై విమానయాన సిబ్బందిని ప్రశ్నించగా.. అసలు జ్యూరిచ్‌లోనే తాము లగేజీ ఎక్కించలేదని విమానయాన సంస్థ ప్రతినిధి కవిన్‌ అంపలం చావుకబురు చల్లగా చెప్పారు. ఆ విమానాశ్రయంలో తగినంత సిబ్బంది లేకపోవడంతో లగేజీ తీసుకురావడం సాధ్యం కాలేదని తెలిపారు. విమానం స్పెయిన్‌లో ప్రయాణికులను దించి తిరిగి స్విట్జర్లాండ్‌ వెళ్లాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ప్రయాణికుల పరిస్థితిని మేము అర్థం చేసుకున్నామని, కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని చెప్పారు. దాంతో అవాక్కవడం ప్రయాణికుల వంతైంది. ఈ ప్రకటన విని.. ‘మా విహార యాత్ర ప్రణాళిక మొత్తం నాశనమైందని’ ఓ ప్రయాణికుడు వాపోయాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని