G20 Summit: ‘ఖలిస్థానీవాదం’పై మోదీ తీవ్ర ఆందోళన.. కెనడా ప్రధానితో భేటీ

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో భేటీ అయ్యారు. ఖలిస్థానీ నిరసనలపై ఇద్దరం మాట్లాడుకున్నట్లు ట్రూడో తెలిపారు.

Updated : 10 Sep 2023 20:12 IST

దిల్లీ: కెనడాలో కొనసాగుతోన్న ఖలిస్థానీ సానుభూతిపరుల దుశ్చర్యల (Khalistan extremism)పై ఆ దేశ ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడోకు భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్ర ఆందోళన తెలియజేశారు. వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడం, భారత దౌత్యవేత్తలపై హింసను ప్రేరేపించడం వంటి దేశవ్యతిరేక కార్యకలాపాలను ఖండించారు. జీ20 శిఖరాగ్ర సదస్సు (G20 Summit) నేపథ్యంలో భారత్‌ వచ్చిన ట్రూడో (Justin Trudeau) ఆదివారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలతోపాటు ఆయా రంగాలపై చర్చించినట్లు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. మరోవైపు భారత్‌ను ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన ఆర్థిక వ్యవస్థగా అభివర్ణించిన ట్రూడో.. తమ దేశానికి కీలక భాగస్వామిగా పేర్కొన్నారు.

Canada: కెనడాలో ఎందుకు ‘సింగ్‌ ఈజ్‌ కింగ్‌’!

‘కెనడా ఎల్లప్పుడూ భావవ్యక్తీకరణ, శాంతియుత నిరసన స్వేచ్ఛ హక్కులను కాపాడుతుంది. ఇది మాకు చాలా ముఖ్యం. అదే సమయంలో హింసను నిరోధించడంతోపాటు విద్వేషానికి వ్యతిరేకంగా చర్యలూ తీసుకుంటుంది’ అని ఖలిస్థాన్‌ అంశంపై మీడియాతో మాట్లాడుతూ ట్రూడో చెప్పారు. అదే విధంగా దేశంలో ఓ వర్గం ఆధ్వర్యంలో సాగే కార్యకలాపాలు.. మొత్తం ఆ వర్గానికి, లేదా కెనడాకు ప్రాతినిధ్యం వహించవని వ్యాఖ్యానించడం గమనార్హం. విదేశీ జోక్యంపై స్పందిస్తూ.. స్థానిక చట్టబద్ధ పాలనను గౌరవించాల్సిన ఆవశ్యకతను చాటిచెప్పినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. కెనడాలో ఖలిస్థానీ సానుభూతిపరుల ఆందోళనలపై భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ.. ట్రూడో ప్రభుత్వం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని