Taliban: మస్క్‌ నేతృత్వంలోని ట్విటర్‌కు తాలిబన్ల అభినందనలు..!

ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని ట్వటర్‌కు అనూహ్యంగా తాలిబన్ల నుంచి ప్రశంసలు వచ్చాయి. ట్విటర్‌లోని వాక్‌స్వేచ్ఛను వారు అభినందించారు.

Published : 11 Jul 2023 13:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎలాన్‌ మస్క్‌(Elon Musk) నేతృత్వంలోని ట్విటర్‌(Twitter )కు అనుకోని వర్గం నుంచి ప్రశంసలు లభించాయి. అఫ్గానిస్థాన్‌ను పాలిస్తున్న తాలిబన్లు (Taliban).. వాక్‌ స్వేచ్ఛ, విశ్వసనీయత విషయంలో ఇతర సామాజిక మాధ్యమాల కంటే ట్విటర్‌ ముందుందని ప్రశంసించారు. ఈ విషయాన్ని తాలిబన్లలోనే అత్యంత క్రూరమైన వర్గంగా పేరున్న హక్కానీ నెట్‌వర్క్‌ అధినేత అనస్‌ హక్కానీ పేర్కొన్నారు.

‘‘ఇతర సోషల్‌ మీడియా వేదికలతో పోలిస్తే ట్విటర్‌ రెండు అంశాల్లో ముందుంది. వీటిల్లో మొదటిది వాక్‌ స్వేచ్ఛ. రెండో అంశం పారదర్శకత.. విశ్వసనీయత. మెటా మాదిరిగా అసహనపు విధానాలను పాటించదు. ట్విటర్‌ను మరో వేదిక భర్తీ చేయలేదు’’ అని అనస్‌ హక్కానీ ట్విట్‌ చేశారు.

మరోవైపు ట్విటర్‌కు పోటీగా మెటా (ఫేస్‌బుక్‌ మాతృసంస్థ) థ్రెడ్స్‌ యాప్‌ను ఇటీవలే విడుదల చేసింది. దీనిలో ట్విటర్‌ వంటి ఫీచర్లే ఉన్నాయి. తమ మేధో హక్కులను వాడుకొని ఈ యాప్‌ చేశారని మస్క్‌ నుంచి విమర్శలు కూడా వచ్చాయి. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌ సీఈవో ఆడమ్‌ మస్సోరీ మాట్లాడుతూ తాము ట్విటర్‌ స్థానాన్ని భర్తీ చేయాలనే లక్ష్యంతో థ్రెడ్స్‌ను తీసుకురాలేదని పేర్కొన్నారు. దాదాపు వారం రోజుల్లోనే థ్రెడ్స్‌ 10 కోట్ల లాగిన్లను సొంతం చేసుకొంది.

గతేడాది మస్క్‌ ట్విటర్‌ను స్వాధీనం చేసుకొన్నాక.. ఉచిత బ్లూటిక్‌ ఆప్షన్లను తొలగించారు. కొత్తగా వచ్చే బ్లూటిక్‌లకు సబ్‌స్క్రిప్షన్‌ ధరను నిర్ణయించారు. దీంతో భారీ సంఖ్యలో తాలిబన్‌ నాయకులు, అధికారులు, మద్దతుదారులు బ్లూటిక్‌ల సబ్‌స్క్రిప్షన్‌లను తీసుకొన్నారు. తాలిబన్లను ఫేస్‌బుక్‌ నుంచి బ్యాన్‌ చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని