ఉక్రెయిన్‌కు సభ్యత్వం కష్టమే

అగ్ర దేశాల అండతో రష్యాపై పోరాడుతున్న ఉక్రెయిన్‌కు నాటోలో చేరాలన్న ఆశ తీరేలా లేదు. నాటోలో సభ్యత్వంపై ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ కాలికి బలపం కట్టుకుని అన్ని దేశాలూ తిరిగి అభ్యర్థిస్తున్నా ఫలితం దక్కేలా లేదు.

Published : 11 Jul 2023 05:59 IST

నాటో వైఖరి ఇదేనా?
ఇజ్రాయెల్‌ తరహా వ్యూహానికి మొగ్గు

అగ్ర దేశాల అండతో రష్యాపై పోరాడుతున్న ఉక్రెయిన్‌కు నాటోలో చేరాలన్న ఆశ తీరేలా లేదు. నాటోలో సభ్యత్వంపై ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ కాలికి బలపం కట్టుకుని అన్ని దేశాలూ తిరిగి అభ్యర్థిస్తున్నా ఫలితం దక్కేలా లేదు. ‘చేర్చుకోం... చేయూతనిస్తాం’ అనేదే ఉక్రెయిన్‌ విషయంలో ప్రస్తుతానికి నాటో దేశాల వైఖరిగా కనిపిస్తోంది. ఒకవేళ ఉక్రెయిన్‌ సభ్యత్వానికి అంగీకరిస్తే అనూహ్య పరిణామాలకు, యుద్ధ విస్తరణకు అది దారి తీస్తుంది. అందుకే మంగళవారం ఆరంభం కాబోతున్న నాటో కూటమి శిఖరాగ్ర సమావేశంలో ఈ అంశం కీలకంగా మారింది. రాజకీయ, భౌగోళిక, దౌత్యపరమైన చిక్కుముడులు ముడిపడి ఉన్న నేపథ్యంలో ఉక్రెయిన్‌కు బయటి నుంచి మద్దతుకే నాటో దేశాలు మొగ్గు చూపుతున్నాయి. అవసరమైతే మధ్యప్రాచ్యంలో గతంలో ఇజ్రాయెల్‌కు ఎలాగైతే మద్దతిచ్చి ఆ దేశాన్ని ఆర్థికంగా, ఆయుధపరంగా సొంతకాళ్లపై నిలబడేలా చేశారో అదే వ్యూహాన్ని ఇక్కడా అనుసరించాలనుకుంటున్నాయి. యుద్ధం ముగిసిన తర్వాత పరిస్థితులను బట్టి ఉక్రెయిన్‌ను చేర్చుకునే సంగతి ఆలోచిద్దామన్నది కూటమి ఆలోచనగా కనిపిస్తోంది. ‘నాటోలో సభ్యత్వానికి ఉక్రెయిన్‌ ఇంకా సిద్ధం కాలేదు’ అని సమావేశానికి బయల్దేరే ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యాఖ్యానించడం గమనార్హం.

ఉక్రెయిన్‌కు అడ్డంకులివే..

రష్యా యుద్ధం మొదలు పెట్టగానే వ్యూహాత్మకంగా ఉక్రెయిన్‌ నాటోలో ఫాస్ట్‌ట్రాక్‌ సభ్యత్వానికి దరఖాస్తు చేసుకుంది. పోలండ్‌, రొమేనియా, స్లొవేకియా, చెక్‌ రిపబ్లిక్‌, ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా, మాంటెనిగ్రో, ఉత్తర మాసిడోనియా మద్దతు తెలిపాయి. కీలకమైన అమెరికా ఆ దరఖాస్తును వాయిదా వేయించింది. నాటో చీఫ్‌ స్టోల్తెన్‌బర్గ్‌ ఉక్రెయిన్‌ దరఖాస్తును పెద్దగా పట్టించుకోలేదు. ఏడాదిన్నర దాటినా ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వంపై ఎలాంటి కదలికా లేదు. నాటోలో ఉక్రెయిన్‌ సభ్యత్వానికి అడ్డుపడుతున్న అంశాలేంటంటే...

1  రష్యాతో యుద్ధం

నాటోలో సభ్యత్వం ఇవ్వాలంటే దరఖాస్తు సమయానికి ఆ దేశం ఎవరితోనూ యుద్ధంలో ఉండకూడదు. నాటో రాజ్యాంగం ప్రకారం కూటమిలోని ఏ ఒక్కరిపై యుద్ధం జరిగినా మిగిలిన అందరిపైనా యుద్ధంగానే పరిగణించి ఆ దేశానికి కూటమి మద్దతిస్తుంది. ఇప్పుడు ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇస్తే రష్యాతో అమెరికా, బ్రిటన్‌, జర్మనీ తదితర 30 దేశాలు ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగినట్లే. ఉక్రెయిన్‌ తరఫున అమెరికా నేరుగా రష్యాతో పోరాడాల్సిందే. అంటే యుద్ధం విస్తరించినట్లే. ఒక రకంగా అది మూడో ప్రపంచ యుద్ధమన్నట్లే. అది నాటో దేశాలకు ఇష్టం లేదు.

2 సభ్యత్వం ఇవ్వకున్నా..

అధికారికంగా సభ్యత్వం ఇవ్వకున్నా ఉక్రెయిన్‌కు ఓ సభ్య దేశానికి ఇవ్వాల్సినంత మద్దతిస్తున్నామన్నది నాటో వాదన. ఆర్థికంగా, ఆయుధాలపరంగా, మానవతా సాయం పరంగా.. ఏ విధంగా చూసుకున్నా ఉక్రెయిన్‌ను నాటో పెద్దన్నలా ఆదుకుంటోంది.

3 ఆ రంగాల్లో ఇంకా సిద్ధం కాలేదు..

నాటోలో సభ్యత్వానికి కొన్ని ఆర్థిక, రాజకీయ, మిలిటరీ ప్రమాణాలున్నాయి. ప్రజాస్వామ్యం పటిష్ఠంగా ఉండాలని నాటో కోరుకుంటుంది. ఉక్రెయిన్‌ రాజకీయ వ్యవస్థ, పాలనా వ్యవస్థలపై నాటోకు నమ్మకం లేదు. ఆ దేశంలో అవినీతి భారీ స్థాయిలో ఉందన్నది వారి అభిప్రాయం.

4  ఏ ఒక్కరు అడ్డుకున్నా..

నాటోలో సభ్యత్వం రావాలంటే సభ్య దేశాలన్నీ అంగీకరించాలి. ఏ ఒక్కరు అడ్డుకున్నా సభ్యత్వం రాదు. ఇప్పుడు టర్కీ కొర్రీ పెట్టడంతో స్వీడన్‌కు సభ్యత్వం ఆగిపోయింది. అలా హంగరీ రూపంలో ఉక్రెయిన్‌కు అడ్డంకి ఎదురయ్యే అవకాశముంది. ఈ రెండు దేశాలకూ సమస్యలున్నాయి. అందుకే నాటో సభ్య దేశమైనా ప్రస్తుత యుద్ధంలో ఉక్రెయిన్‌కు హంగరీ పెద్దగా మద్దతివ్వడం లేదు. పుతిన్‌వైపు మాట్లాడుతోంది. ఫ్రాన్స్‌, జర్మనీలు ఉక్రెయిన్‌కు సభ్యత్వంపై అంతంతమాత్రంగానే ఉన్నాయి.

5 పుతిన్‌కు బలం..

రష్యాపై దాడికి నాటో ప్రయత్నిస్తోందంటూ అధ్యక్షుడు పుతిన్‌ పదేపదే ఆరోపిస్తూ వస్తున్నారు. ఇప్పుడు నాటోలో ఉక్రెయిన్‌కు సభ్యత్వమిస్తే ఆ ఆరోపణలకు ఊతమిచ్చినట్లు అవుతుంది. పుతిన్‌కు అన్ని విధాలా బలం చేకూరుతుంది. అది నాటోకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టం లేదు. అందుకే ఉక్రెయిన్‌కు బయటి నుంచి మద్దతుకే పరిమితమవుతోంది.

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని