Afghanistan: హిజాబ్‌ ధరించకుంటే పార్క్‌లోకి నో ఎంట్రీ.. మహిళలపై తాలిబన్ల ఆంక్షలు

హిజాబ్‌ సరిగా ధరించని మహిళలను జాతీయ పార్కులోకి అనుమతించకూడదని అఫ్గాన్‌లోని తాలిబన్‌ ప్రభుత్వం సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆంక్షల ద్వారా మహిళలను ప్రకృతి నుంచి కూడా దూరం చేయాలని భావిస్తున్నారనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

Updated : 28 Aug 2023 13:03 IST

 

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌(Afghanistan)లో తాలిబన్లు (Talibans) అధికారం కైవసం చేసుకున్న తర్వాత మహిళలపై కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. కొద్ది నెలల క్రితం మహిళలను మాధ్యమిక విద్యతోపాటు, యూనివర్శిటీలో చదువులకు దూరం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత దూర ప్రయాణాలు, బ్యూటీ సెలూన్లపై నిషేధం విధించారు. తాజాగా, హిజాబ్‌ ధరించని మహిళలను బమియాన్‌లోని బంద్‌-ఈ-అమిర్‌ జాతీయ పార్కు సహా దేశంలోని ఇతర జాతీయ పార్కుల్లోకి అనుమతించకూడదని నిర్ణయించారు. ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని తాలిబన్‌ ప్రభుత్వం వైస్‌ అండ్‌ వర్చ్యు మినిస్ట్రీ (ఇస్లామిక్‌ చట్టాల అమలు శాఖ) మంత్రి మహ్మద్‌ ఖలీద్‌ హనాఫీ సిబ్బందికి సూచించారు.

మహిళలు పార్కులను సందర్శించడం తప్పనిసరి కాదని హనాఫీ పేర్కొన్నారు. హిజాబ్‌ సరిగా ధరించని మహిళలను జాతీయ పార్కులోకి అనుమతించకూడదని సిబ్బందికి సూచించారు. అవసరమైతే వారిని అడ్డుకునేందుకు బలప్రయోగం చేయాలని ఆదేశించినట్లు తాలిబన్‌ అధికార ప్రతినిధి మహ్మద్‌ సాధిఖ్‌ అఖిఫ్‌ వెల్లడించారు. మహిళలు ఇంటి నుంచి బయటికి వచ్చేప్పుడు ఇస్లామిక్‌ నిబంధనలను సరిగా పాటించడంలేదనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

తైవాన్‌ అధ్యక్ష రేసులో.. ఫాక్స్‌కాన్‌ వ్యవస్థాపకుడు

ఈ ఆదేశాలపై అఫ్గాన్‌లో మహిళల స్వేచ్ఛ కోసం పోరాడుతున్న హ్యుమన్‌ రైట్‌ వాచ్‌ సంస్థ ప్రతినిధి హీథర్‌ బార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత మహిళలను విద్య, ఉద్యోగం, క్రీడలు నుంచి దూరం చేశారు. ఇప్పుడు ప్రకృతి, పార్కుల నుంచి దూరం చేయాలని భావిస్తున్నారు. ఇది ప్రణాళికా బద్ధంగా మహిళల స్వేచ్ఛను హరించడమే’’ అని హీథర్‌ ఆరోపించారు. అఫ్గాన్‌లో మహిళలపై ఆంక్షలు విధించడంపై అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కానీ, తాలిబన్లు మాత్రం.. మహిళలు స్వేచ్ఛ కోసం చేసే ఆందోళనలు, నిరసనలను హింసాత్మకంగా అణచివేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని