Foxconn Founder: తైవాన్‌ అధ్యక్ష రేసులో.. ఫాక్స్‌కాన్‌ వ్యవస్థాపకుడు

ఫాక్స్‌కాన్‌ (Foxconn) వ్యవస్థాపకుడు టెర్రో గౌ.. తైవాన్‌ అధ్యక్ష రేసులోకి దిగారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.

Published : 28 Aug 2023 11:41 IST

తైపీ: తైవాన్‌ (Taiwan)లో వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ప్రముఖ బిలియనీర్‌, ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం ఫాక్స్‌కాన్‌ (Foxconn) వ్యవస్థాపకుడు టెర్రీ గౌ (Terry Gou) అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగుతున్నారు. ఈ ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రస్తుత అధికార డొమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (DPP)పై విమర్శలు గుప్పించారు. ‘‘అధికార పార్టీ విధానాలు తైవాన్‌ను చైనాతో యుద్ధం ముప్పులోకి నెట్టేశాయి’’ అని దుయ్యబట్టారు.

కాగా.. కొన్నేళ్లుగా అధ్యక్ష పదవి కోసం కలలు కంటున్న టెర్రీ గౌ (Terry Gou).. 2019 ఫాక్స్‌కాన్‌ చీఫ్‌ బాధ్యతల నుంచి దిగిపోయారు. అదే ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రతిపక్ష కువోమింగ్‌తాంగ్‌ పార్టీలో చేరారు. అయితే, ఆ పార్టీ తరఫున అభ్యర్థిగా నామినేట్‌ కాకపోవడంతో అప్పుడు తన ప్రయత్నాలను విరమించుకున్నారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్‌ ప్రోగ్రోసివ్‌ పార్టీ అభ్యర్థి అయిన త్సాయి ఇంగ్‌ వెన్‌ (Tsai Ing-wen) అధ్యక్షురాలిగా విజయం సాధించారు.

అమెరికా ఎన్నికల్లో వివేకానందం! అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో రామస్వామి దూకుడు

తాజాగా మరోసారి కువోమింగ్‌తాంగ్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేసేందుకు ముందుకొచ్చారు. అయితే ఈ సారి కూడా టెర్రీ గౌను కాకుండా న్యూ తైపీ సిటీ మేయర్‌ హు యు ఇయ్‌ను ఎంపిక చేస్తూ ఈ ఏడాది మే నెలలో ప్రకటన చేసింది. దీంతో పార్టీ నుంచి బయటకు వచ్చిన టెర్రీ గత మూడు నెలలుగా ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు నేడు ప్రకటించారు.

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ యాపిల్‌కు ఫాక్స్‌కాన్‌ (Foxconn) ప్రధాన ముడిసరుకు సరఫరాదారుగా ఉంది. చైనాలో ఈ కంపెనీకి అనేక ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇక తైవాన్‌ను చైనా తమ భూభాగంగానే పేర్కొంటున్న విషయం తెలిసిందే. ఇక్కడి ప్రధాన ప్రతిపక్షమైన కువోమింగ్‌తాంగ్‌ పార్టీకి చైనాతో మంచి అనుబంధం ఉంది. మరోవైపు, శాశ్వత స్వతంత్ర దేశంగా ప్రకటించుకునేందుకు ప్రయత్నిస్తున్న తైవాన్‌.. 2024 జనవరిలో అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని