చోరీల గురించి ప్రియురాలికి తెలియకూడదని.. సీఈవోను చంపేసిన పీఏ

ఓ టెక్‌ సీఈవో దగ్గర పీఏగా పని చేస్తున్న ఒక వ్యక్తి.. కంపెనీ ఖాతా నుంచి లక్షల డాలర్లు కాజేశాడు. ఈ నేరం బయటకు వస్తే ప్రియురాలు తనను వదిలేస్తుందని భయపడి ఏకంగా తన బాస్‌నే దారుణంగా హత మార్చాడు.

Published : 26 May 2024 00:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రియురాలిని సంతోషపరిచేందుకు చోరీలకు అలవాటుపడిన ఓ వ్యక్తి.. తన వ్యవహారం గురించి ఆమెకు తెలియకుండా ఉంచేందుకు ఏకంగా తన బాస్‌ అయిన ఓ టెక్‌ కంపెనీ సీఈవోను దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ముక్కలుగా నరికి మృతదేహాన్ని మాయం చేశాడు. న్యూయార్క్‌లో చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..

ఫహిమ్‌ సలేహ్‌ (33) న్యూయార్క్‌లోని ఓ టెక్‌ కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తున్నారు. టైరీస్‌ హాస్పిల్‌ (25) అతడి దగ్గర పీఏగా పని చేస్తున్నాడు. మెరైన్ చావెజ్ అనే యువతితో హాస్పిల్‌ చాలాకాలంగా ప్రేమలో ఉన్నాడు. ఆమెను ఎలాగైనా సంతోషపెట్టాలనుకున్న అతడు.. చోరీలకు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలోనే కంపెనీ బ్యాంకు ఖాతా నుంచి వేల డాలర్లను కాజేశాడు. అలా 4 లక్షల డాలర్లు (రూ. 3 కోట్ల 32 లక్షలకు పైగా) చోరీ చేశాడు.

నాడు మిత్రుడి భార్యతో ఎలాన్‌ మస్క్‌ అఫైర్‌ నిజమే.. అమెరికాలో సంచలన కథనం

కొన్ని రోజుల తర్వాత డబ్బు మాయం కావడానికి హాస్పిల్‌ కారణమని గుర్తించిన సీఈవో అతడిని నిలదీశాడు. ఈ విషయం పెద్దది చేయవద్దని తన బాస్‌ను వేడుకున్నాడు. అతడిపై కాస్త జాలి చూపిన సలేహ్‌ వాయిదాల వారీగా డబ్బు తిరిగి చెల్లించాలని అవకాశం ఇచ్చాడు. అయినా, కుక్క తోక వంకర అన్నట్లుగా అతడు బుద్ధిని మాత్రం మార్చుకోలేదు. మరో మార్గంలో మరికొంత డబ్బును చోరీ చేసే ప్రయత్నంలో సీఈవోకు దొరికిపోయాడు. ఈ విషయం తన గర్ల్‌ఫ్రెండ్‌కు తెలిస్తే.. తనని ఎక్కడ వదిలేస్తుందోనని భయపడ్డాడు.

దీంతో సీఈవోను చంపేందుకు పథకం రచించించాడు. ముసుగు ధరించి తన బాస్‌ అపార్ట్‌మెంట్‌లోకి రహస్యంగా చొరబడ్డ హాస్పిల్‌.. అతడిని దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి.. తన నేరం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడు. మృతుడి బంధువు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే తన ప్రియురాలితో ఉన్న హాస్పిల్‌ను పోలీసులు పట్టుకున్నారు. తనకు ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదని వాదించాడు. న్యాయస్థానంలో అతడి నేరం రుజువైతే కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు