One Chip Challenge: ఆ బాలుడి మృతి ‘వన్‌ చిప్‌ ఛాలెంజ్‌’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్‌?

One Chip Challenge: పాఖీ కంపెనీ విసిరిన వన్‌ చిప్‌ ఛాలెంజ్‌ తీవ్ర విమర్శలకు దారితీసింది. గత ఏడాది సంభవించిన హారిస్ వోలోబా మరణానికి ఇదే కారణమని పరోక్షంగా తేల్చింది.

Updated : 17 May 2024 10:51 IST

One Chip Challenge | వాషింగ్టన్‌: పాఖీ కంపెనీ విసిరిన ‘‘వన్ చిప్ ఛాలెంజ్‌’’లో పాల్గొన్న 14 ఏళ్ల బాలుడి మరణానికి గల కారణం వెల్లడైంది. మసాచుసెట్స్‌కు చెందిన హారిస్ వోలోబా.. అధిక మోతాదులో క్యాప్సైసిన్ అనే ఘాటు పదార్థాన్ని తీసుకోవడం వల్లే మరణించినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు. వోలోబా గత ఏడాది సెప్టెంబరులో ఈ ఛాలెంజ్‌లో (One Chip Challenge) పాల్గొని.. గుండెపోటుతో మరణించాడు. శవపరీక్ష నివేదిక తాజాగా వెలువడింది.

‘‘అధిక క్యాప్సైసిన్ సాంద్రత గల ఆహార పదార్థాన్ని ఇటీవల తీసుకున్న నేపథ్యంలో వోలోబాలో కార్డియోపల్మోనరీ అరెస్ట్‌కు దారితీసింది’’ అంటూ నివేదికలో మరణానికి కచ్చితమైన కారణంగా వైద్యులు పేర్కొన్నారు. మరోవైపు వోలోబాకు పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్య ఉందని.. అది కుటుంబ సభ్యులకు తెలియదని తెలిపారు. మరణించిన సమయంలో అతడి గుండె ఉబ్బిపోయి ఉందని వెల్లడించారు.

ఏంటీ వన్‌ చిప్‌ ఛాలెంజ్‌..

పాఖీ కంపెనీ సామాజిక మాధ్యమాల్లో విసిరినదే ఈ వన్‌ చిప్‌ ఛాలెంజ్‌ (One Chip Challenge). దీంట్లో పాల్గొనాలనుకునేవారు కంపెనీకి చెందిన ఒక కరోలినా రీపర్‌ చిప్‌ను తినాలి. తర్వాత ఎటువంటి ఆహారపదార్థం, నీరు తీసుకోవద్దు. దీంట్లో చాలా మంది సెలబ్రిటీలూ పాల్గొనటంతో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ చిప్ తిన్నవారు లైవ్‌లోనే వాంతులు చేసుకోవడం, కళ్లు తిరిగి పడిపోవడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఈ ఛాలెంజ్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. 2023లో వోలోబా మరణం తర్వాత పాఖీ కంపెనీ ఈ ఛాలెంజ్‌ను ఉపసంహరించుకుంది. మార్కెట్‌ నుంచి చిప్‌లను వెనక్కి తీసుకుంది.

అత్యంత ఘాటు చిప్‌లను తయారు చేసే కంపెనీగా ఈ సంస్థ పేరొందింది. దీన్ని మరింత ప్రమోట్‌ చేసుకోవడానికి ‘వన్‌ చిప్‌ ఛాలెంజ్‌’కు (One Chip Challenge) రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా మిరపకాయ సారంతో పాటు అత్యంత ఘాటు మసాలాలతో కూడిన చిప్‌ను తయారు చేసి విక్రయించడం ప్రారంభించింది. అదీ శవపేటిక ఆకారంలో ఉండే ప్యాకేజ్‌లో ఉంచి అమ్మడం గమనార్హం. ఇది వయోజనులకు మాత్రమేనని ప్యాకింగ్‌పై స్పష్టంగా పేర్కొంది. చిన్న పిల్లలకు దూరంగా ఉంచాలని పేర్కొంది.

పాఖీ స్పందనిదే..

వోలోబా మరణంపై కంపెనీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ‘‘తమ ఛాలెంజ్‌ (One Chip Challenge) కేవలం వయోజనుల కోసం మాత్రమేనని.. దీన్ని ప్యాకేజ్‌పై స్పష్టంగా పేర్కొన్నాం. అనారోగ్య సమస్యలున్నవాళ్లు, ఘాటు పదార్థాలు తీసుకోలేనివాళ్లు, చిన్న పిల్లలు ఈ చిప్‌ తినొద్దని స్పష్టంగా తెలియజేశాం. అయినా, ఈ సూచనలు పట్టించుకోలేదనే సమాచారం మాకు అందింది. ఈ నేపథ్యంలో ఆహార భద్రత ప్రమాణాల ప్రకారమే తయారుచేసినప్పటికీ.. చిప్‌లను 2023 సెప్టెంబర్‌లోనే మార్కెట్‌ నుంచి వెనక్కి తీసుకున్నాం. ఛాలెంజ్‌ను ఆపేశాం’’ అని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని