Helicopter Crashes: ప్రపంచంలో ఘోర హెలికాప్టర్‌ ప్రమాదాలివే..

Helicopter Crashes: ప్రపంచంలో ఇప్పటివరకు సంభవించిన అత్యంత ఘోరమైన హెలికాప్టర్‌ ప్రమాదాలు ఏవో చూద్దాం

Updated : 20 May 2024 20:38 IST

Helicopter Crashes: అత్యవసర సమయాల్లో హెలికాప్టర్లు ఎంత ఉపయోగకరమో వాటి చరిత్రే చెబుతోంది. అదే సమయంలో అనేక దుర్ఘటనలకూ (Helicopter Crashes) అవి కారణమయ్యాయి. వీటిలో కొన్ని సాంకేతిక లోపాల వల్ల కూలిపోతే.. మరికొన్ని ప్రతికూల వాతావరణం వల్ల కుప్పకూలాయి. మరికొన్ని శత్రువుల దాడులకూ నేలకొరిగాయి. తాజాగా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణంతో హెలికాప్టర్‌ ప్రమాదాలపై మరోసారి చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలో ఇప్పటివరకు ప్రపంచంలో సంభవించిన అత్యంత ఘోరమైన హెలికాప్టర్‌ ప్రమాదాలేంటో చూద్దాం.

1968- వియత్నాం- సీహెచ్‌-53ఏ:  వియత్నాం యుద్ధంలో పలు హెలికాప్టర్లు నేలకొరిగాయి. 1968 జనవరి 8న సీహెచ్‌-53ఏ సీ స్టాలియన్‌ కూలిన ఘటనలో 46 మంది దుర్మరణం చెందారు. 10 రోజుల తర్వాత శకలాలు లభ్యమయ్యాయి. ప్రతికూల వాతావరణమే ఈ దుర్ఘటనకు కారణంగా తేల్చారు.

1977- ఇజ్రాయెల్‌- సీహెచ్‌-53డీ సీ స్టాలియన్‌: జోర్డాన్‌ వ్యాలీలో 1977 మే 10న సీహెచ్‌-53డీ సీ స్టాలియన్‌ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో 54 మంది మృతిచెందారు. దీనికి ఇప్పటివరకు కారణం తెలియరాలేదు. పాలస్తీనా లేదా జోర్డాన్‌కు చెందిన ఉగ్రవాదుల పని అని అనుమానించారు.

1981- ఇంగ్లాండ్‌- వెస్ట్‌లాండ్ వెసెక్స్‌ 60: వెస్ట్‌లాండ్ వెసెక్స్‌ 60 హెలికాప్టర్‌ ఆగస్టు 13, 1981న ప్రమాదానికి గురైంది. దీంట్లో ఇద్దరు పైలెట్లు సహా 13 మంది మరణించారు. మెయిన్‌ రోటార్‌ గేర్‌బాక్స్‌లో లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అంచనా వేశారు.  ధ్రువీకరించడానికి శకలాలు కూడా దొరకలేదు.

బెల్‌-212..ఇరాన్‌ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్‌హార్స్‌’!

1983- ఇంగ్లాండ్‌- సికోర్‌స్కీ ఎస్‌-61: సెల్టిక్‌ సముద్రంలో 1983 జులై 16న సికోర్‌స్కీ ఎస్‌-61 వాణిజ్య హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో 20 మంది చనిపోయారు. ప్రతికూల వాతావరణాన్ని అంచనా వేయడంలో పైలెట్‌ తప్పిదమే ప్రమాదానికి కారణం.

1986- స్కాట్లాండ్‌- బోయింగ్‌ 234 ఎల్‌ ఆర్‌ చినూక్‌: 1986 నవంబర్‌ 6న జరిగిన ఈ హెలికాప్టర్‌ ప్రమాదంలో 45 మంది మృతి చెందారు. ఐరోపా చరిత్రలోనే అతిపెద్ద హెలికాప్టర్‌ ప్రమాదం. సంబర్గ్‌ విమానాశ్రయానికి సమీపంలోని సముద్రంలో ఇది మునిగిపోయింది. సాంకేతిక లోపం వల్ల ఇది జరిగింది.

1997- ఇజ్రాయెల్‌- సికోర్‌స్కీ ఎస్‌-65సీ-3: ఆగస్టు 17, 1997న ఇజ్రాయెల్‌-లెబనాన్‌ సరిహద్దుల్లో ఈ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ప్రమాదమే 2000లో లెబనాన్‌ సరిహద్దుల నుంచి ఇజ్రాయెల్‌ బలగాల ఉపసంహరణకు కారణమైంది.  73 మంది సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అసలు కారణం తెలియకపోయినప్పటికీ.. సాంకేతిక లోపం వల్లే జరిగినట్లు అంచనా వేశారు.

2002- రష్యా- మిల్‌ మీ-26: ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక హెలికాప్టర్‌గా మిల్‌ మీ-26కు పేరుంది. ఇది రెండో చెచెన్‌ యుద్ధంలో కుప్పకూలింది. చెచెన్‌ వేర్పాటువాదుల క్షిపణి వల్లే ఇది జరిగినట్లు రష్యా ప్రకటించింది. 127 మంది రష్యన్‌ సైనికులు మరణించారు.

2009- వెనిజువెలా- మిల్‌ మీ-35: వెనిజువెలాలోని తాచిరా ప్రాంతంలో ఈ హెలికాప్టర్‌ కుప్పకూలింది. 17 మంది సైనిక సిబ్బంది మరణించారు. దీనికి సరైన కారణం తేలియరాలేదు. ప్రతికూల వాతావరణం వల్లే సంభవించి ఉంటుందని అంచనా వేశారు.

2020- యూఎస్‌ఏ- సికోర్‌స్కీ ఎస్‌-76బీ: కాలిఫోర్నియాలోని కాలబాసాస్ ప్రాంతంలో 2020 జనవరి 26న ఈ హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎన్‌బీఏ లెజెండ్‌ కోబే బ్రయంట్‌ ప్రాణాలు కోల్పోయారు. ప్రతికూల వాతావరణం వల్లే ప్రమాదం జరిగింది.

2021- భారత్‌- మిల్‌ మీ-17: భారత వాయుసేనకు చెందిన మిల్‌ మీ 17వీ-5 తమిళనాడులోని కోయంబత్తూరు-వెల్లింగ్టన్‌ మధ్య కుప్పకూలింది. ఈ ఘటనలో భారత త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి సహా 13 మంది మరణించారు. ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణమైంది.

లోక్‌సభ మాజీ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి, ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, ప్రముఖ నటి సౌందర్య సైతం హెలికాప్టర్‌ ప్రమాదాల్లో మరణించిన విషయం తెలిసిందే. సంజయ్‌ గాంధీ, మాధవ్‌రావ్‌ సింధియా వంటి ప్రముఖ నేతలు విమాన ప్రమాదాల్లోనే ప్రాణాలు కోల్పోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని