Ebrahim Raisi: బెల్‌-212.. ఇరాన్‌ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్‌హార్స్‌’!

Ebrahim Raisi: హెలికాప్టర్‌ ప్రమాదంలో ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతిచెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ బెల్‌ 212గా గుర్తించారు.

Updated : 20 May 2024 11:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) దుర్మరణం చెందారు. స్థానిక న్యూస్‌ ఏజెన్సీలు విడుదల చేసిన ఫొటోలు, వీడియోల ప్రకారం ఆయన ప్రయాణించిన హెలికాప్టర్‌ను బెల్‌-212గా (Bell 212) గుర్తించారు. దీన్ని అమెరికాకు చెందిన బెల్‌ టెక్స్‌ట్రాన్‌ కంపెనీ తయారు చేసింది. ఇది టెక్సాస్‌లోని ఫోర్ట్‌వర్త్‌ కేంద్రంగా పనిచేస్తోంది.

ప్రమాదానికి గురైన తాజా హెలికాప్టర్‌లో రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్‌ అమీరబ్దొల్లహియన్ సహా ఎంత మంది ఉన్నారనేది ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. బెల్‌-212లో (Bell 212) సిబ్బంది సహా గరిష్ఠంగా 15 మంది ప్రయాణించగలరు. రెండు బ్లేడ్లతో ఉండే ఈ మధ్యశ్రేణి హెలికాప్టర్‌ను పౌర, వాణిజ్య, సైనిక అవసరాలకు వినియోగించుకునేలా రూపొందించారు. దీన్ని బెల్‌ 205కు కొనసాగింపుగా 1960లో ప్రవేశపెట్టారు. కంపెనీ తయారు చేసే కీలక మోడళ్లలో ఇదొకటి. పరిశ్రమలో అత్యంత సమర్థమైనదిగా.. ‘వర్క్‌హార్స్‌’గా దీన్ని పేర్కొంటుంటారు.

ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ దుర్మరణం.. మోదీ దిగ్భ్రాంతి

గతంలోనూ ప్రమాదాలు..

ఈ హెలికాప్టర్‌ గతంలోనూ ఘోర ప్రమాదాలకు గురైన సందర్భాలు ఉన్నాయి. 1997లో పెట్రోలియం హెలికాప్టర్స్‌కు చెందిన బెల్‌-212.. లూసియానా తీరంలో కుప్పకూలింది. దీంట్లో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. సాధారణ ఆఫ్‌షోర్‌ రవాణా కార్యకలాపాలు చేపడుతుండగా.. మెకానికల్‌ సమస్య తలెత్తి ప్రమాదం జరిగింది. 2009లో కెనడాలోని న్యూఫౌండ్‌లాండ్‌లో జరిగిన ప్రమాదంలో 17 మంది మృతిచెందారు. ఇంజిన్‌లో ఆయిల్ ప్రెజర్‌ కోల్పోయిన కారణంగా దుర్ఘటన సంభవించినట్లు తేల్చారు. కెనడా చరిత్రలోనే అతిపెద్ద హెలికాప్టర్‌ ప్రమాదంగా ఇది నిలిచింది.

ఆధునిక హెలికాప్టర్లలో అనేక భద్రతా పీచర్లు వస్తున్నాయి. వాటన్నింటినీ ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ప్రయాణికుల రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ మెకానికల్‌ లోపాలు, ప్రతికూల వాతావరణం, మానవ తప్పిదాల కారణంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఒక్కోసారి శత్రువుల దాడిలోనూ కుప్పకూలుతుంటాయి. ఇలా హెలికాప్టర్‌ ప్రమాదాలకు చాలా కారణాలే ఉంటాయి.

ఇరాన్‌ పేలవ వాయు రవాణా భద్రత చరిత్ర..

తాజా హెలికాప్టర్‌ ప్రమాదానికి ఇంకా కారణాలు తెలియాల్సి ఉంది. ఇరాన్ వాయు రవాణా భద్రత చరిత్ర మాత్రం చాలా పేలవంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీనికి అమెరికా ఆంక్షలు కొంత వరకు కారణమని నిపుణులు చెబుతున్నారు. రైసీ ప్రయాణించిన తాజా హెలికాప్టర్‌ను 1979లో కొనుగోలు చేసినట్లు సమాచారం. తర్వాత వారికి అమెరికా విక్రయాలు నిలిపివేసినట్లు తెలుస్తోంది. గతంలో ఇరాన్‌ రక్షణ, రవాణా శాఖ మంత్రులు సహా పలువురు కమాండర్లు విమాన, హెలికాప్టర్‌ ప్రమాదాల్లో మరణించిన ఘటనలు ఉన్నాయి.

అణు కార్యక్రమాలను పరిమితం చేసుకోవడం ద్వారా పాశ్చాత్య దేశాలతో సత్సంబంధాలకు ఇరాన్‌ కృషి చేసింది. తద్వారా తమ విమాన, హెలికాప్టర్లను ఆధునికీకరించేందుకు ప్రణాళికలు రచించింది. కానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో అవి తలకిందులయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు