Israel-Hamas: గాజా ఆసుపత్రిపై దాడి ఉగ్ర చర్యే: నెతన్యాహు

Gaza Hospital Attack: గాజా ఆసుపత్రిలో పేలుడు ఘటనపై హమాస్‌, ఇజ్రాయెల్‌ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఉగ్రవాదులు ప్రయోగించిన రాకెట్‌ గురితప్పి ఆ దారుణం చోటుచేసుకుందని ఇజ్రాయెల్ మిలిటరీ దుయ్యబట్టింది.

Updated : 18 Oct 2023 10:58 IST

గాజా: ఇజ్రాయెల్‌ (Israel) దాడులతో విలవిల్లాడుతున్న గాజా (Gaza)లో మంగళవారం ఘోర ఘటన చోటుచేసుకొంది. అల్‌ అహ్లి ఆసుపత్రి (Attack on Hospital)లో పేలుడు సంభవించి 500 మంది మరణించినట్లు సమాచారం. ఈ ఘటనతో పశ్చిమాసియా దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. కాగా.. ఈ దారుణానికి ఇజ్రాయెల్‌ వైమానిక దాడులే కారణమని హమాస్‌ (Hamas) ఆరోపించగా.. దాన్ని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) ఖండించారు. అది ఉగ్రమూకల దుశ్చర్యే అని దుయ్యబట్టారు.

ఐడీఎఫ్‌ కాదు: నెతన్యాహు

‘‘ఈ విషయాన్ని యావత్‌ ప్రపంచం తెలుసుకోవాలి. గాజాలోని అనాగరిక ఉగ్ర మూకలే.. అక్కడి ఆసుపత్రిపై దాడి చేశాయి. ఐడీఎఫ్‌ (ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌) కాదు. మా పిల్లలను అతి దారుణంగా హత్య చేసిన ఆ ఉగ్రవాదులు.. ఇప్పుడు వారి పిల్లలను కూడా చంపేస్తున్నారు’’ అని నెతన్యాహు ఆరోపించారు. అటు ‘ఇజ్రాయెల్ డిఫెన్స్‌ ఫోర్సెస్‌’ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ఆసుపత్రి సమీపంలో పీఐజే మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్‌ గురితప్పి ఆసుపత్రిలో పేలుడు సంభవించిందని పేర్కొంది. ఈ మేరకు ఐడీఎఫ్‌ అధికారిక ఎక్స్‌ (ట్విటర్‌)ఖాతాలో ఓ వీడియో, కొన్ని పోస్టులు చేసింది.   గాజాలో దారుణం!.. ఆసుపత్రిలో పేలుడు; 500 మంది మృతి?

అరబ్‌ నేతలతో బైడెన్‌ భేటీ రద్దు..

ఆసుపత్రిలో పేలుడు ఘటనపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిగానే తాను జోర్డాన్‌ రాజు అబ్దుల్లా 2, ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడినట్లు తెలిపారు. మరోవైపు, ఈ దాడి నేపథ్యంలో బైడెన్‌ జోర్డాన్‌ పర్యటన రద్దయ్యింది. జోర్డాన్‌లో ఆయన అబ్దుల్లాతో పాటు ఈజిప్టు ప్రధాని ఎల్‌-సిసీ, పాలస్తీనా అధ్యక్షుడు మహ్‌ముద్‌ అబ్బాస్‌ తదితరులతో భేటీ కావాల్సి ఉండగా.. ఆ సమావేశం రద్దయినట్లు జోర్డాన్‌ విదేశాంగ మంత్రి తెలిపారు. ఇందుకు గల కారణాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. మరోవైపు బైడెన్‌ ఇప్పటికే ఇజ్రాయెల్‌ పర్యటన నిమిత్తం బయల్దేరారు.

ఇజ్రాయెల్‌కు రిషి సునాక్‌..!

బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ కూడా ఈ వారం ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ స్కై న్యూస్‌ కథనం వెల్లడించింది. అయితే దీన్ని 10-డౌనింగ్‌ స్ట్రీట్‌ ధ్రువీకరించలేదు. గతవారం ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించేందుకు బ్రిటన్‌ విదేశాంగ మంత్రి జేమ్స్‌ క్లెవర్లీ టెల్‌ అవీవ్‌లో పర్యటించారు.

3200కు పెరిగిన మృతులు..

మరోవైపు ఇజ్రాయెల్‌ దాడులతో గాజాలో మరణాలు సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 3,200 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 11వేల మంది గాయపడినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అటు గాజా ఆసుపత్రి ఘటనపై ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని