గాజాలో దారుణం!

గాజాలో దారుణం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఆసుపత్రిలో పేలుడు సంభవించి 500 మంది మరణించినట్లు సమాచారం.

Updated : 18 Oct 2023 04:55 IST

ఆసుపత్రిలో పేలుడు; 500 మంది మృతి?
ఇజ్రాయెల్‌ వైమానిక దాడే కారణం: హమాస్‌
లెబనాన్‌ సరిహద్దులో ఘర్షణ

జెరూసలెం, ఖాన్‌ యూనిస్‌: గాజాలో దారుణం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఆసుపత్రిలో పేలుడు సంభవించి 500 మంది మరణించినట్లు సమాచారం. దీనికి ఇజ్రాయెల్‌ వైమానిక దాడులే కారణమని హమాస్‌ ఆరోపిస్తోంది. గాజా సిటీలోని అల్‌ అహ్లి ఆసుపత్రిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే దశాబ్దాలుగా జరుగుతున్న ఇజ్రాయెల్‌, పాలస్తీనా ఘర్షణల్లో ఇదే అతి పెద్ద దారుణ ఘటన అవుతుంది. మరోవైపు ఉత్తర గాజాలో ఉన్న ప్రజలంతా దక్షిణ గాజాకు వెళ్లాలని ఆదేశించిన ఇజ్రాయెల్‌ అక్కడా బాంబు దాడులు చేస్తోంది. మంగళవారం దక్షిణ గాజాపై చేసిన దాడుల్లో డజన్ల సంఖ్యలో పాలస్తీనా వాసులు మరణించారు. వారిలో ఉత్తర గాజా నుంచి వలస వచ్చిన వారూ ఉన్నారు. ఇటు లెబనాన్‌ సరిహద్దులోనూ మంగళవారం ఇజ్రాయెల్‌, హెజ్‌బొల్లా మధ్య ఘర్షణ జరిగింది. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న గాజాకు సాయం అందించడానికి మధ్యవర్తుల ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో గాజాకు మానవతా సాయం అందించేందుకు సహకరించాలని కోరుతూ రష్యా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. బుధవారం ఇజ్రాయెల్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ పర్యటించనున్నారు.

దక్షిణ గాజా విలవిల

ఇప్పటికే ఉత్తర గాజా నుంచి వస్తున్న జనంతో నిండిపోతున్న దక్షిణ గాజాపై మంగళవారం ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో విరుచుకుపడింది. రఫా, ఖాన్‌ యూనిస్‌ పట్టణాల శివార్లలో వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల కారణంగా రఫాలో 27 మంది, ఖాన్‌ యూనిస్‌లో 30 మంది మరణించారని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఖాన్‌ యూనిస్‌లోని నాజర్‌ ఆసుపత్రికి 50 మృత దేహాలు వచ్చాయని అంతర్జాతీయ మీడియా ప్రతినిధి ఒకరు తెలిపారు. అవి రక్తమోడుతున్నాయని వివరించారు. డెయిర్‌ అల్‌-బలా పట్టణంలో జరిగిన దాడిలో 11 మంది మృతి చెందారు. హమాస్‌ నేతల లక్ష్యంగా ఈ దాడులు చేశామని ఇజ్రాయెల్‌ వెల్లడించింది.

  • గాజా సివిల్‌ డిఫెన్స్‌ ప్రధాన కార్యాలయంపై సోమవారం ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడిలో 10 మంది వైద్యులు, ఏడుగురు వైద్య సిబ్బంది మరణించారు. సోమవారం రాత్రి గాజాలోని 200 హమాస్‌ స్థావరాలపై దాడులు జరిగాయి. తమ నౌకాదళం హమాస్‌పై దాడులు మొదలు పెట్టిందని ఇజ్రాయెల్‌ వెల్లడించింది. ఈ దాడుల్లో హమాస్‌ సురా కౌన్సిల్‌ అధిపతి ఒసామా మజిని మరణించినట్లు పేర్కొంది. సెంట్రల్‌ గాజాపై మంగళవారం ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో తమ టాప్‌ కమాండర్‌ ఆయ్‌మన్‌ నోఫల్‌ మరణించినట్లు హమాస్‌ ప్రకటించింది.
  • ఉత్తర గాజాపై భూతల దాడులకు నిర్ణయం తీసుకోలేదు.. తీసుకున్నాక దాడులు మొదలవుతాయని ఇజ్రాయెల్‌ సైనికాధికారులు తెలిపారు.

లెబనాన్‌ సరిహద్దులో..

లెబనాన్‌లోని హెజ్‌బొల్లాకు చెందిన కీలక లక్ష్యాలపై ఇజ్రాయెల్‌ వైమానిక దళం దాడులు చేపట్టింది. లెబనాన్‌ నుంచి మంగళవారం ఉదయం యాంటీ ట్యాంక్‌ క్షిపణి దూసుకొచ్చి మెతులా పట్టణంలో పడింది. ముగ్గురు గాయపడ్డారు. సరిహద్దులో గోడను బాంబులతో ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన నలుగురు మిలిటెంట్లను హతమార్చామని ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది.


బైడెన్‌ రాక

మెరికా అధ్యక్షుడు బైడెన్‌ బుధవారం ఇజ్రాయెల్‌ రానున్నారు. జోర్దాన్‌లోనూ ఆయన పర్యటిస్తారు. అరబ్‌ నేతలతో సమావేశమవుతారు. హమాస్‌తో ఇజ్రాయెల్‌ పోరు తీవ్రమవుతున్న నేపథ్యంలో తమ సైనికులను అమెరికా సిద్ధం చేసినట్లు సమాచారం. ఏ క్షణమైనా ఇజ్రాయెల్‌కు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని 2వేల మంది సైనికులను పెంటగాన్‌ ఆదేశించినట్లు ఓ సైనికాధికారి తెలిపారు.  


ఇరాన్‌ హెచ్చరిక

గాజాపై హింసాత్మక దాడులకు పాల్పడితే ఈ ప్రాంతమంతా స్పందిస్తుందని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయతొల్లా అలీ ఖమేనీ స్పష్టం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని