Haji Salim: ఎవరీ డ్రగ్స్‌ కింగ్‌పిన్‌ హాజీ సలీం..!

హాజీ సలీం.. భారత ఎన్‌సీబీ అధికారుల మోస్ట్‌వాంటెడ్‌ డ్రగ్స్‌ కింగ్‌పిన్‌. పాక్‌ ఐఎస్‌ఐ అండతో అతడు అరేబియా సముద్రంలో వేల కోట్ల డ్రగ్స్‌ సామ్రాజ్యాన్ని నిర్వహిస్తున్నాడు. ఇటీవల భారత పశ్చిమప్రాంత తీరదళం అతడికి చెందిన భారీ కన్‌సైన్‌మెంట్‌ను స్వాధీనం చేసుకొంది.

Updated : 15 May 2023 12:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: అరేబియా సముద్రంలో రెండ్రోజుల క్రితం కోట్ల విలువైన 2.5 టన్నుల మెథంఫెటమిన్‌ మాదకద్రవ్యాన్ని(Drugs) సీజ్‌ చేశారు. భారత(India) చరిత్రలో ఇంత విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి. దీని ధర ఎంతలేదన్నా రూ.15,000 కోట్లు. అంతర్జాతీయ మార్కెట్లో రూ.25వేల కోట్ల వరకు ఉండొచ్చని ఎన్‌సీబీ(NCB) అధికారులు చెబుతున్నారు. అంటే పాకిస్థాన్‌(Pakistan) వద్ద ఉన్న మొత్తం విదేశీ మారకద్రవ్యంలో దాదాపు సగానికి సమం అన్నమాట. ఇటీవల కాలంలో పలుమార్లు మాదకద్రవ్యాలను పట్టుకొన్నారు. వీటి విలువ వేల కోట్లలోనే ఉంటోంది. ఈ మొత్తం మత్తు వ్యాపారం వెనుక కింగ్‌పిన్‌ పాకిస్థాన్‌లో ఉన్నాడు. అతడి పేరు హాజీ సలీం..!

మూడు దేశాల్లో స్థావరాలు మారుస్తూ..

హాజీ సలీం ఎక్కడా ఒక చోట స్థిరమైన స్థావరంలో ఉండడని ఎన్‌సీబీ అధికారులు వెల్లడించారు. అతడు కొలంబియా డ్రగ్‌ లార్డ్‌ పాబ్లో ఎస్కోబార్‌ తరహాలో స్థావరాలను మార్చేస్తాడని పేర్కొన్నారు. ఇరాన్‌, పాకిస్థాన్‌ అఫ్గానిస్థాన్‌ల నుంచి తన వ్యాపారం నిర్వహిస్తుంటాడు. అతడికి ఐఎస్‌ఐ అండదండలు పుష్కలంగా లభిస్తాయి. పాకిస్థాన్‌లో అతడు బలోచిస్థాన్‌ ప్రావిన్స్‌లో ఉంటాడు. అతడి వెంట ఎప్పుడూ ఏకే-47లు, ఇతర అత్యాధునిక ఆయుధాలతో కూడిన బాడీగార్డుల వలయం ఉంటుంది. సలీం ఎల్లవేళలా శాటిలైట్‌ ఫోన్‌ వాడుతుంటాడు. మాల్దీవుల నుంచి పాకిస్థాన్‌ వరకు కమ్యూనికేషన్లు నెరుపుతుంటాడు. ఇప్పటికే డీజీ స్థాయి సమావేశంలో భారత్‌ అతడి వివరాలను పాక్‌, ఇరాన్, అఫ్గాన్‌కు అందించింది. కానీ, ఎటువంటి ఫలితంలేదు. ఇతడికి మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీంతో బలమైన సంబంధాలు ఉన్నాయి. డ్రగ్‌ డీల్స్ కోసం కరాచీలోని క్లిఫ్టన్‌ రోడ్డులో దావూద్‌ రహస్య స్థావరానికి ఇతడు వస్తుంటాడు.

సలీం నుంచి వచ్చే కన్‌సైన్‌మెంట్లపై ప్రత్యేక కోడ్‌..

డ్రగ్స్‌ సరఫరాలో సలీం ఓ ప్రత్యేక శైలిని అనుసరిస్తాడు. మాదక ద్రవ్యాలను కార్టల్స్‌కు సరఫరా చేసేందుకు ముందుగానే సొమ్మును తీసుకోడు. అప్పుపై వాటిని సరఫరా చేస్తాడు. తొలుత వాటిని విక్రయించి.. ఆ తర్వాత వచ్చిన సొమ్మును హవాల మార్గంలో చెల్లించమని చెబుతాడు. కొన్ని నెలల క్రితం భారత్‌లో అతడి తరఫున పనిచేస్తున్న వారిని ముంద్రా పోర్టు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది.

ఇక సలీం నుంచి వివిధ కార్టల్స్‌కు సరఫరా అయ్యే మాదకద్రవ్యాల ప్యాకెట్లపై ప్రత్యేకమైన గుర్తులుంటాయి. ఇవి ఆ కార్టల్స్‌కు మాత్రమే తెలుసు. వీటిల్లో 999, 777, రోలెక్స్‌ 555, తేలు, బిట్‌కాయిన్‌, ఎగిరే గుర్రం, కింగ్‌ 21 వంటి గుర్తులను ఎన్‌సీబీ, డీఆర్‌ఐ, ఎన్‌ఐఏ సంస్థలు గుర్తించాయి. ఇతడి నుంచి సరఫరా అయ్యే డ్రగ్స్‌ కనీసం ఏడు పొరలతో బలంగా ప్యాక్‌ చేస్తారు. వాటిని నీటిలో పడేసినా దెబ్బతినకుండా ఇలా చేస్తుంటారు.

శ్రీలంక పడవలను వాడుకొని..

సలీం మాదకద్రవ్యాల సరఫరా విషయంలో ఎవరికీ అనుమానం రాకుండా ఎక్కువగా శ్రీలంక  పడవలను వాడుతుంటాడు. అవి ఖాళీగా ఇరాన్‌, పాక్‌ జలాలకు వెళితే అక్కడ వాటిల్లో సగటున 350 కిలోల డ్రగ్స్‌ను లోడ్‌ చేస్తారు. ఈ పడవలు కేరళ తీరంలో భారత్‌లోకి ప్రవేశిస్తాయి. భారత నౌకాదళ పడవల కదలికలు తెలుసుకోవడానికి స్థానిక మత్స్యకారులను వాడుకొంటారు. నౌకాదళం కదలికలు ఉంటే మాత్రం శ్రీలంక లేదా మాల్దీవులకు పారిపోతుంటారు. కానీ, చాలావరకు వీరు దొరికి పోతుంటారు. ఒక వేళ తీరం సమీపానికి చేరితే వీటిని 20-50 కిలోల బ్యాచ్‌లుగా విడదీసి ఇతర పడవల్లోకి మార్చేస్తారు. తాజాగా ‘ఆపరేషన్‌ సముద్రగుప్త్‌’లో కేరళ తీరంలోనే 2.5 టన్నుల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొన్నారు. పాక్‌లోని జివాని నుంచి బయల్దేరిన మదర్‌ షిప్‌పై అధికారులు దాడి చేయడంతో ఈ స్థాయిలో మత్తుపదార్థాలు దొరికాయి.  ‘ఆపరేషన్‌ సముద్రగుప్త్‌’లో ఇప్పటి వరకు భారత్‌ రూ.40 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొంది.

* గతేడాది సలీం గ్యాంగ్‌ లిక్కర్‌కు వాడే బియ్యానికి హెరాయిన్‌ పూతపూసి తరలిస్తుండగా దిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. వీటి విలువ రూ.1,725 కోట్లు.

* 2022లో భారత్‌లోని గుజరాత్‌ తీరంలో ఏటీఎస్‌, కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది 50 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకొన్నారు. దీని విలువ రూ.50 కోట్లు.

* గతేడాది దుబాయ్‌ నుంచి నవీ ముంబయి పోర్టుకు వచ్చిన కంటైనర్‌ను తీసుకోవడానికి ఎవరూ రాలేదు. దీనిని అధికారులు తనిఖీ చేయగా 72 కిలోల హెరాయిన్‌ బయటపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని