ఉక్రెయిన్‌ నిఘా అధిపతి భార్యపై విషప్రయోగం.. ఇది రష్యా కుట్రేనా..?

ఉక్రెయిన్‌(Ukraine) సైన్యంలో అత్యంత కీలక హోదాలో ఉన్న అధికారి భార్యపై విషప్రయోగం జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే, దీని వెనక రష్యా హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

Published : 29 Nov 2023 14:02 IST

కీవ్‌: ఉక్రెయిన్‌(Ukraine) గూఢచర్య విభాగం అధిపతి భార్యపై విషప్రయోగం జరిగింది. ఆ విషంలో అధిక మోతాదులో లోహాలు ఉన్నట్లు స్పై ఏజెన్సీ ప్రతినిధులు వెల్లడించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin)పై విమర్శలు గుప్పించిన, వ్యతిరేకించే వ్యక్తులు అనుమానాస్పద రీతిలో మరణిస్తుంటారు. ప్రస్తుతం రెండుదేశాల మధ్య యుద్ధం వేళ.. ఈ వార్తలు వెలుగులోకి రావడం సంచనలంగా మారింది.

ఉక్రెయిన్‌ మిలిటరీ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ (GUR)కి కిర్లో బుడనోవ్‌ అధిపతిగా ఉన్నారు. ఆయన భార్య పేరు మరియానా బుడనోవా. ఆమె కీవ్ మేయర్‌కు సలహాదారుగా పనిచేస్తున్నారు. అయితే, ఇటీవల ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరారు. ‘దురదృష్టవశాత్తు ఆ వార్తలు నిజం. ఆమె అనారోగ్యానికి గురయ్యారు’ అని నిఘా సంస్థ ప్రతినిధి యుసోవ్‌ వెల్లడించారు. అయితే ఆమెపై విషప్రయోగం జరిగిందా..? లేదా.? అనేదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

‘డెత్‌ విండో’.. రష్యా ప్రముఖుల మిస్టరీ మరణాలు..!

అలాగే నిఘా సంస్థకు చెందిన పలువురు అధికారుల్లో కూడా స్వల్పస్థాయి విషప్రయోగం లక్షణాలు కనిపించాయి. ‘కమాండర్‌ను చేరుకోవడం అసాధ్యం కాబట్టి ఆయన భార్యను లక్ష్యంగా చేసుకున్నారు’ అని సదరు ప్రతినిధి మాటలను ఉటంకిస్తూ మీడియా కథనాలు వెల్లడించాయి. ఆ విషంలో మెర్క్యూరీ, ఆర్సెనిక్‌ ఉన్నాయని యుసోవ్‌ తెలిపారు. ఈ విషప్రయోగం వెనక రష్యా హస్తం ఉందని ఉక్రెయిన్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, దీనిపై రష్యా నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభమైన దగ్గరి నుంచి బుడనోవ్‌ పాపులారిటీ పెరుగుతూ వస్తోంది. రష్యా దాడుల్ని తిప్పికొట్టడంలో ఈయన తెరవెనక వ్యూహాలు రచిస్తున్నారని ప్రశంసలు పొందుతున్నారు. 37 ఏళ్ల బుడనోవ్‌పై ఎన్నోసార్లు హత్యాయత్నాలు జరిగాయి. ఒకసారి ఆయన కారుపై బాంబుదాడి కూడా జరిగింది. తాజాగా ఆయన భార్య తీసుకున్న ఆహారంలో విషం కలిసినట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ ఇది నిర్ధారణ అయితే.. గత ఏడాది ప్రారంభం నుంచి జరుగుతోన్న యుద్ధంలో ఒక ఉన్నతస్థాయి వ్యక్తి కుటుంబం లక్ష్యంగా జరిగిన దాడి ఇదే.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు