SpaceX: ‘స్టార్‌షిప్‌’ ప్రయోగం.. మూడోసారి విఫలం

‘స్పేస్‌ఎక్స్‌’కు చెందిన ‘స్టార్‌షిప్‌’ భారీ రాకెట్‌ మరోసారి విఫలమైంది. గంటపాటు ప్రయాణించిన స్పేస్‌క్రాఫ్ట్‌.. భూమిపైకి తిరిగి చేరుకునే క్రమంలో ‘స్పేస్‌ఎక్స్‌’ సెంటర్‌తో కమ్యూనికేషన్‌ కోల్పోయింది.

Updated : 15 Mar 2024 01:32 IST

వాషింగ్టన్‌: ‘స్పేస్‌ఎక్స్‌ (SpaceX)’ మూడోసారి తన ప్రతిష్ఠాత్మక ‘స్టార్‌షిప్‌ (Starship)’ భారీ రాకెట్‌ ప్రయోగ పరీక్ష మూడోసారి విఫలమైంది. స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం ఉదయం దక్షిణ టెక్సాస్‌ తీరం నుంచి ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. తొలుత బూస్టర్‌ విడిపోయింది. అనంతరం గంటపాటు ప్రయాణించిన స్పేస్‌క్రాఫ్ట్‌.. భూమిపైకి తిరిగి చేరుకునే క్రమంలో ‘స్పేస్‌ఎక్స్‌’ సెంటర్‌తో కమ్యూనికేషన్‌ కోల్పోయింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఇది హిందూ మహాసముద్రంలో దిగాలి.

గతేడాది ఏప్రిల్‌, నవంబరులో ‘స్టార్‌షిప్‌’ రెండు టెస్ట్‌ఫ్లైట్‌లు విఫలమైన విషయం తెలిసిందే. మొదటి ప్రయోగంలో భాగంగా గాల్లోకి ఎగిరిన 4 నిమిషాలకే గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోలో కూలిపోయింది. రెండోసారి స్పేస్‌క్రాఫ్ట్‌ మరింత దూరం దూసుకెళ్లినా.. సాంకేతిక కారణాలతో కొన్ని నిమిషాలకే కమ్యూనికేషన్‌ తెగిపోయింది. దీంతో రాకెట్‌ దారితప్పకుండా దాన్ని పేల్చేశారు. ఈసారి గంటకుపైగా ప్రయాణం సాగినప్పటికీ విఫలమైంది. 

చౌకైన లేజర్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థను ఆవిష్కరించిన బ్రిటన్‌

స్టార్‌షిప్‌ రాకెట్‌ పొడవు ఏకంగా 121 మీటర్లు (400 అడుగులు). రెండు దశల (బూస్టర్‌, స్పేస్‌క్రాఫ్ట్‌)తో ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్‌గా పేరుపొందిన దీన్ని.. చందమామ, అంగారకుడిపై యాత్రలకు వీలుగా ‘స్పేస్‌ఎక్స్‌’ రూపొందించింది. తాజా ప్రయోగంపై సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ స్పందిస్తూ.. ఈ రాకెట్‌ మనుషులను అంగారకుడి వద్దకు చేర్చుతుందని ట్వీట్‌ చేశారు. బహుళ గ్రహాలపై జీవనాన్ని సుసాధ్యం చేస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని