Beach: బీచ్‌లో గులకరాళ్లు తీస్తే .. రూ.2 లక్షల జరిమానా!

స్పెయిన్‌లోని కానరీ దీవుల్లో స్థానిక అధికారులు పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలకు ఉపక్రమించారు. స్థానిక బీచ్‌ల నుంచి పర్యటకులు గులకరాళ్లు, ఇసుక తీసుకెళ్తే భారీ మొత్తంలో జరిమానా విధిస్తున్నారు.

Updated : 23 Mar 2024 00:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బీచ్‌కి వెళ్లినప్పుడు అక్కడ రకరకాల ఆకృతుల్లో దొరికే గులకరాళ్లను కొందరు సరదాగా సేకరిస్తుంటారు. వాటిని భద్రంగా దాచుకుంటారు. కొందరికి ఇది అలవాటు కూడా. అయితే, స్పెయిన్‌లోని (Spain) కానరీ దీవుల్లో (Canary Islands) ఇలా చేస్తే జరిమానా విధిస్తారట. అలాగని వందో రెండొందలో కాదు.. ఏకంగా రూ.లక్షల్లోనే. ఈ దీవులు అందాలకు నెలవు. యేటా లక్షల మంది పర్యటకులు ఇక్కడికి వస్తుంటారు. ఇలా వచ్చినవారంతా అక్కడ దొరికే అందమైన రాళ్లు, ఇసుకను ఇష్టంగా తీసుకెళ్లిపోతున్నారట. దీంతో పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోందనే ఉద్దేశంతో అక్కడి అధికారులు చర్యలకు ఉపక్రమించారు. 128 పౌండ్లు (దాదాపు రూ.13,478) నుంచి 2,563 పౌండ్లు (దాదాపు రూ.2,69,879) వరకు జరిమానా విధిస్తున్నారు.

టన్నుల కొద్దీ మాయం

కానరీ సమూహంలో ప్రధానంగా ఏడు దీవులున్నాయి. అవి.. టెనెరిఫ్‌, గ్రాన్‌ కనారియా, లాంజ్‌రోట్‌, ఫ్యూయెట్‌ఈవెంట్యురా, లాపామా, లా గొమెరా, ఎల్‌ హెయిరో. ఇందులో ఒక్కో దీవికి ఒక్కో ప్రత్యేకత ఉంది. స్పెయిన్‌లో అత్యంత ఎత్తైన శిఖరం టెయిడ్‌.. టెనెరిఫ్‌ ద్వీపంలోనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది పర్యటకులు లాంజ్‌రోట్‌ ద్వీప సందర్శనకు వెళ్తుంటారు. అగ్నిపర్వతం లావా (volcanic material) నుంచి ఏర్పడిన చిన్నచిన్న గులక రాళ్లు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. దీంతో పలువురు వాటిని తమ వెంట తీసుకెళ్తుంటారు. దీంతో యేటా టన్నుల కొద్దీ రాళ్లు మాయవుతున్నాయని అక్కడి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విమానాశ్రయంలో తనికీలు

మరోవైపు ఫ్యూయెట్‌ఈవెంట్యురా దీవిలోని ‘పాప్‌కార్న్‌ బీచ్‌’ సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది. పాప్‌కార్న్‌ ఆకారంలో ఉండే గులకరాళ్లు ఇక్కడి ప్రత్యేకత. దీంతో ఇక్కడికి వచ్చినవారంతా వాటిని తీసుకెళ్లిపోతున్నారు. ఇక్కడ కూడా ప్రతినెలా వేలాది కేజీల గులకరాళ్లు, ఇసుక మాయవుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో తీరప్రాంత ఉనికి ప్రమాదంలో పడుతోందని, ముందస్తు చర్యల్లో భాగంగానే జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. సందర్శకులను తనికీ చేసేందుకు విమానాశ్రయాల్లో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటుచేశారు. అయితే, వారు తీసుకొచ్చిన ఇసుక, గులకరాళ్లు నిషేధించిన ప్రాంతాల నుంచే తీసుకొచ్చారో? లేదో గుర్తించేందుకు వారు తీవ్ర తంటాలు పడుతున్నారు. పర్యటకులంతా పర్యావరణాన్ని కాపాడేందుకు సహకరించాలని అక్కడి ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని