Explosives: పాఠశాల కింద 2వేలకు పైగా బాంబులు..! అసలేం జరిగిందంటే..!

ఓ పాఠశాల కింద వేల కొద్ది బాంబులు లభ్యం కావడం కలకలం రేపిన ఘటన కంబోడియాలో చోటుచేసుకుంది.

Updated : 15 Aug 2023 15:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ పాఠశాల (High School) కింద వేల కొద్ది బాంబులు లభ్యం కావడం కలకలం రేపింది. ఆయుధాలు, మందుపాతరలు, రాకెట్‌ లాంచర్లు కలిపి సుమారు ఇవి 2వేలకుపైగా లభ్యమయ్యాయి. కొత్త భవనం నిర్మించేందుకు తవ్విన సమయంలో ఇవి బయటపడటం భయాందోళనలకు గురిచేసింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు అక్కడ మరిన్ని తవ్వకాలు చేపట్టారు. పాఠశాలలో వెలుగుచూసిన ఆ బాంబులు.. గతంలో అక్కడి అంతర్యుద్ధం (civil war) సమయంలో పాతిపెట్టినవిగా గుర్తించారు. కంబోడియా ఈశాన్య ప్రాంతంలోని ఓ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కంబోడియా ఈశాన్య ప్రాంతంలోని క్రాంటీ ప్రావిన్సులో క్వీన్‌ కొసామక్‌ హైస్కూల్‌ ఉంది. వెయ్యి మంది విద్యార్థులున్న ఆ పాఠశాలలో కొత్త భవనం నిర్మించేందుకు గోతులు తవ్వగా.. ఆయుధాలు బయటపడుతుండటం కనిపించింది. దీంతో ఆ ప్రదేశంలో కంబోడియన్‌ మైన్‌ యాక్షన్‌ సెంటర్‌ (సీఎంఏసీ) తవ్వకాలు జరిపింది. పాఠశాల కింద 2116 పేలని బాంబులు లభించాయి. వాటిలో ఎం70 గ్రెనేడ్లు, ఫ్యూజ్‌ఎం48 బాంబులు, బీ40 రాకెట్‌ లాంచర్లు లభ్యమయ్యాయి. అక్కడ మరిన్ని ఆయుధాలు ఉండవచ్చని సీఎంఏసీ భావిస్తోంది. ఈ క్రమంలో కొన్నిరోజుల పాటు పాఠశాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

మందుపాతరలపై ‘ఎలుకె’త్తింది..!

అంతర్యుద్ధం సమయంలో ఈ పాఠశాల ఉన్న ప్రాంతాన్ని ఆయుధ కేంద్రంగా ఉపయోగించిన విషయం తనకు తెలుసని.. సీఎంఏసీ డైరెక్టర్‌ జనరల్‌ హేంగ్‌ రతానా వెల్లడించారు. కానీ ఈ స్థాయిలో బాంబులను భూమిలో దాచిపెట్టడం నమ్మలేకపోతున్నానని అన్నారు. ఒకవేళ వాటిని ఏదైనా బలంగా తాకితే అవి పేలిపోయే అవకాశం ఉందని.. ముందస్తుగా గుర్తించడంతో భారీ ప్రమాదం తప్పిందన్నారు. ఆయుధాలలన్నింటినీ అక్కడ నుంచి తరలించామన్నారు. మరోవైపు 2025 నాటికి ఇటువంటి ల్యాండ్‌ మైన్స్‌, పేలని బాంబులను గుర్తించి నిర్వీర్యం చేయాలని అక్కడి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

కంబోడియా.. 1970ల్లో భయంకరమైన అంతర్యుద్ధాన్ని (Cambodian Civil War) ఎదుర్కొంది. ఘర్షణల తదనంతరం పరిణామాల్లో ఆకలి, అనారోగ్యం కారణంగా 17లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. మూడు దశాబ్దాలపాటు సాగిన ఘర్షణల సమయంలో భారీస్థాయిలో మందుపాతరలు, ఇతర పేలుడు పదార్థాను వినియోగించారు. 1970ల నుంచి ఈ దేశంలో 40-60 లక్షల వరకూ మందుపాతరలను అమర్చి ఉంటారని అంచనా. అందులో దాదాపు 30 లక్షల మందుపాతరల జాడను ఇంకా గుర్తించాల్సి ఉంది. వీటి బారిన పడి దేశవ్యాప్తంగా 64వేల మంది బలయ్యారు. దాదాపు 40 వేల మంది కాళ్లు, చేతులు పోగొట్టుకున్నారు. 2025నాటికి దేశవ్యాప్తంగా ఉన్న ఇటువంటి ఆయుధాలను గుర్తించి నిర్వీర్యం చేయాలని అక్కడి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని