యూట్యూబర్‌ ‘ఫ్రీ గిఫ్ట్‌’లకు ఎగబడ్డ జనం.. రణరంగంగా న్యూయార్క్‌ వీధులు

తమ అభిమాన వ్యక్తిని చూసి, అతడిచ్చే కానుకలను తీసుకునేందుకు జనం పోటెత్తడంతో న్యూయార్క్ (New York) వీధులు రణరంగంగా మారాయి. అభిమానులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుని పలువురు గాయపడ్డారు.

Updated : 05 Aug 2023 15:36 IST

న్యూయార్క్‌: తన అభిమానులకు బహుమతులు ఇస్తానని ప్రకటించి చిక్కుల్లో పడ్డాడో ఆన్‌లైన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ (Online Influencer). అతడిచ్చే కానుకలు తీసుకునేందుకు వేలాది మంది ఒక్కసారిగా పోటెత్తడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే అల్లర్లు చెలరేగి పరిస్థితులు రణరంగంగా మారాయి. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. అమెరికా (USA)లోని న్యూయార్క్‌ (New York)లో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

న్యూయార్క్‌కు చెందిన 21ఏళ్ల ఆన్‌లైన్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ కై సీనట్ (Kai Cenat) మన్‌హటన్‌ యూనియన్‌ స్క్వేర్‌ పార్క్‌లో శుక్రవారం సాయంత్రం లైవ్‌ స్ట్రీమింగ్‌ ఈవెంట్‌ చేయనున్నట్లు తన ఇన్‌స్టా పేజీలో ఓ పోస్ట్‌ పెట్టాడు. ఈ కార్యక్రమంలో అభిమానులను నేరుగా కలుస్తానని, అంతేగాక వారికి ప్లే స్టేషన్‌ 5 గేమ్‌ కన్సోల్స్‌ సహా పలు గిఫ్ట్‌లు (Free Gifts) ఇస్తానని ప్రకటించాడు.

ఇంకేముంది సీనట్‌ పోస్ట్‌తో మన్‌హటన్‌ పార్క్‌కు అతడి అభిమానులు పోటెత్తారు. 2వేలకు పైగా మంది యువత సీనట్‌ను చూసేందుకు అక్కడకు వచ్చారు. దీంతో వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. వీరిని అదుపుచేసేందుకు పోలీసులు అక్కడకు చేరుకుని బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

నల్లసముద్రంలో రష్యాకు మరో భారీ దెబ్బ

సీనట్‌ అభిమానుల్లో కొంతమంది పార్క్‌ వీధుల్లో వాహనాలను అడ్డగించి అల్లర్లకు పాల్పడ్డారు. ఒకరినొకరు తోసుకోవడం, బాటిళ్లు విసరడం, కార్లను ధ్వంసం చేయడం వంటివి చేశారు. కొందరు అక్కడున్న నిర్మాణాలపైకి ఎక్కి నినాదాలు చేశారు. ఈ ఘర్షణల్లో పోలీసు అధికారుల సహా పలువురు గాయపడ్డారు. ఉద్రిక్తతలు తీవ్రమవడంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అటు, భద్రతా కారణాల దృష్ట్యా సీనట్‌ను కూడా పోలీసులు అక్కడి నుంచి మరో ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం అతడిని ప్రశ్నిస్తున్నారు. ఇక, అల్లర్లను ప్రేరేపించినందుకు గానూ అతడిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

21 ఏళ్ల సీనట్‌ ఓ పాపులర్‌ వీడియో క్రియేటర్‌. ట్విచ్ అనే లైవ్‌స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో అతడికి 65లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్‌, ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమాల్లోనూ అతడికి లక్షల్లో అభిమానులున్నారు. గతేడాది స్ట్రీమ్‌ అవార్డుల్లో స్ట్రీమర్‌ ఆఫ్ ది ఇయర్‌గా నిలవడంతో అతడికి మరింత పాపులారిటీ పెరిగింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు