Japan Tsunami: జపాన్‌కు సునామీ ముప్పు.. గతంలో విలయం సృష్టించిన విపత్తులివి!

జపాన్‌లో అత్యంత తీవ్రమైన భూ ప్రకంపనల నేపథ్యంలో రష్యా, ఉత్తర కొరియా దేశాలు సునామీ (Tsunami) హెచ్చరికలతో అప్రమత్తమయ్యాయి.

Updated : 01 Jan 2024 19:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జపాన్‌లో తాజాగా వచ్చిన వరుస భూ ప్రకంపనలు (Earthquake) తీర ప్రాంతాల ప్రజలను వణికించాయి. ప్రపంచ దేశాలు నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోయిన వేళ.. జపాన్‌ వాసులను మాత్రం అక్కడి సునామీ హెచ్చరికలు ఉలిక్కిపడేలా చేశాయి. మరికొన్ని రోజుల పాటు వరుస ప్రకంపనల ముప్పు పొంచి ఉండటంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ప్రభుత్వం కూడా హెచ్చరించింది. ఇలా అత్యంత తీవ్రమైన భూ ప్రకంపనల నేపథ్యంలో జపాన్‌తోపాటు రష్యా, ఉత్తర కొరియాలూ సునామీ (Tsunami) హెచ్చరికలతో అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో గతంలో సంభవించిన అత్యంత వినాశకర భూకంపాలను జపాన్‌ వాసులు గుర్తుచేసుకుంటున్నారు.

ఏమిటీ సునామీ..?

సముద్రం దగ్గర లేదా లోపల బలమైన భూకంపాలు ఏర్పడినప్పుడు, సముద్ర గర్భంలోని అగ్నిపర్వతాలు విస్ఫోటం చెందినప్పుడు సునామీలు ఏర్పడవచ్చు. ఈ విపత్తుల సమయంలో భారీ పరిమాణంలో నీరు స్థానభ్రంశం చెందుతుంది. ఈ క్రమంలో ఉవ్వెత్తున ఎగసిపడే నీటి తరంగాల వరుసను సునామీ అంటారు. మహా సముద్రాలు, సముద్రాలు, నదుల్లోనూ ఈ రాకాసి అలలు ఏర్పడతాయి. బలమైన భూకంపాల వల్ల సముద్రపు అగాధాల్లో ఏర్పడే సునామీ కెరటాలు వందల కిలోమీటర్ల పొడవునా ప్రయాణిస్తుంటాయి. ఒక్కో తరంగం ఒకదాని తర్వాత ఒకటి నిమిషాల వ్యవధిలో అనుసరిస్తుంటాయి. ఇవి తీర ప్రాంతాన్ని తాకినప్పుడు భారీ నష్టం వాటిల్లుతుంది.

మూడు అతిపెద్ద సునామీలు..

హిందూ మహాసముద్రం సునామీ 2004: ఇండోనేషియా సుమత్రా తీరంలో 9.1 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల ఇది ఏర్పడింది. ఆ అలలు దాదాపు 100 అడుగుల ఎత్తుకు ఎగిశాయి. దాదాపు 18 దేశాలు ప్రభావితమయ్యాయి. ఆ ఘటనలో 2.5 లక్షల మంది చనిపోగా.. మరో 17 లక్షల మంది నిరాశ్రయులైనట్లు అంచనా. భారత్‌లోనూ 10వేల మంది ప్రాణాలు కోల్పోగా.. 5వేల మందికి పైగా పౌరులు గల్లంతయ్యారు. శ్రీలంకలో 40వేల మంది చనిపోయారు.

చిగురుటాకులా వణికిన జపాన్‌.. వరుసగా 21 భూకంపాలు..!

తోహోకు భూకంపం, సునామీ (2011): జపాన్‌ తీరంలో, 2011 మార్చిలో 9.0 తీవ్రతతో వచ్చిన శక్తిమంతమైన భూకంపం (Great Tohoku earthquake) భారీ సునామీకి కారణమయ్యింది. ఆ సమయంలో సముద్ర అలలు 130 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఎగిశాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ విపత్తులో సుమారు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. మరో 2500 మంది ఆచూకీ లేకుండా పోయింది. 1.20 లక్షల ఇళ్లు పూర్తిగా నాశనం కాగా, 2.7 లక్షల నివాసాలు దెబ్బతిన్నట్లు అంతర్జాతీయ నివేదికలు అంచనా వేశాయి. ఫుకుషిమా న్యూక్లియర్‌ ప్లాంటు కూడా దెబ్బతింది.

లిటుయా బే సునామీ, అలస్కా (1958): జులై 10, 1958లో ఆగ్నేయ అలస్కాలో 7.8 నుంచి 8.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దాని ప్రభావంతో అత్యంత పెద్ద రాయి (30.6మిలియన్‌ క్యుబిక్‌ మీటర్లు).. లుటియా బే (Lituya Bay)లో పడిపోయింది. అది భారీ అలలకు దారితీసింది. దాదాపు 1720 అడుగుల ఎత్తులో అలలు వచ్చినట్లు అంచనా. ఇప్పటివరకు ప్రపంచంలో ఎత్తైన సునామీ అల ఇదే కావడం గమనార్హం. అయితే, ఆ ఘటనలో ఐదుగురు మాత్రమే మరణించారు.

తాజాగా జపాన్‌ తీర ప్రాంతాల్లో 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపాలతో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. తీర రాష్ట్రాలైన ఇషికావా, నీగట, తొయామా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం సూచించింది. ప్రజలంతా ఎత్తయిన సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని హెచ్చరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని