Japan: చిగురుటాకులా వణికిన జపాన్‌.. వరుసగా 21 భూకంపాలు..!

జపాన్‌ వరుసగా 21 భూకంపాలతో వణికిపోయింది. దీనికి తోడు స్వల్పశ్రేణి సునామీ అలలు తీరాన్ని తాకాయి. వేల ఇళ్లకు విద్యుత్త సరఫరా నిలిచిపోయింది.

Updated : 01 Jan 2024 17:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ద్వీప దేశం జపాన్‌ వరుస భూకంపాలతో నూతన సంవత్సరం గజగజలాడిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో భూకంప లేఖినిపై 4.0 తీవ్రత కంటే అధిక స్థాయిలో ఏకంగా 21 భూకంపాలు నమోదయ్యాయి. దీంతో ఇషికావా ద్వీపకల్పంలో వాజిమా పోర్టులో 4.21 గంటల సమయంలో దాదాపు 1.2 మీటర్ల ఎత్తులో సునామీ అలలను గుర్తించారు. వాజిమాలో చాలా వీధులు, భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల రహదారులపై భారీగా పగుళ్లు ఏర్పాడ్డాయి. మరికొన్ని చోట్ల సునామీ అలలు అత్యధికంగా ఐదు మీటర్ల ఎత్తు వరకు రావచ్చని హెచ్చరికలు జారీ చేశారు. దాదాపు 36 వేల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.  

హోక్కాయిడో నుంచి నాగసాకి వరకు సునామీ ముప్పు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రానికి సమీపంలోని ప్రధాన హైవేలను మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. ఇషికావాలోని ప్రధాన అణువిద్యుత్తు కేంద్రం మాత్రం ఇప్పటి వరకు సురక్షితంగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గతేడాది మే నెలలో జపాన్‌లో దాదాపు రిక్టర్‌ స్కేల్‌పై 6.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. అప్పట్లో 13 మంది గాయపడగా.. ఒకరు మృతి చెందారు. అప్పుడు కూడా భూకంప కేంద్రం ఇషికావా ప్రాంతంలోనే ఉంది. 

తాజాగా వచ్చిన భూకంపం 1983లో వచ్చిన సీ ఆఫ్‌ జపాన్‌ భూకంపంతో పోలిఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అప్పట్లో ఈ భూకంపంలో 104 మంది పౌరులు మరణించగా.. 324 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

జపాన్‌లో అత్యధిక భూకంపాలు..

జపాన్‌లో ఏటా సగటున 5 వేల చిన్నాపెద్దా భూకంపాలు వస్తుంటాయి. అక్కడి ప్రజలు వీటిని ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. జపాన్‌ పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌లో ఉంటుంది. 40వేల కిలోమీటర్ల పొడవైన ఈ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌లో 450 అగ్నిపర్వతాలున్నాయి. అందులో మెజారిటీ అగ్నిపర్వతాలు జపాన్‌లోనే కనిపిస్తాయి. అవి నిరంతరం క్రియాశీలకంగా ఉంటాయి. జపాన్‌ 4 కాంటినెంటల్‌ ప్లేట్స్‌ చర్యలతో సంబంధం కలిగి ఉంది. ద పసిఫిక్‌, ద ఫిలిప్పీన్‌, ద యురేసియన్‌, ద నార్త్‌ అమెరికా ప్లేట్‌లు తరచూ కదులుతూ ఉంటాయి. దాంతో భూమి కదిలి భూప్రకంపనలు, భూకంపాలు వస్తుంటాయి. ఇవే కాకుండా జపాన్‌ ట్రెంచ్‌గా పిలుస్తున్న జపనీస్‌ అగాధం కూడా భూకంపాలు రావడానికి మరో కారణం. పసిఫిక్‌ వాయువ్య ప్రాంతంలోని ఈ సముద్ర అగాధం 800 మీటర్ల లోతులో ఉంటుంది. అందులో కదలికలు ఏర్పడినప్పుడు భూకంపాలు, సునామీలు వస్తుంటాయి. 

ఎరుపెక్కిన ఎర్రసముద్రం

భూకంపంతోపాటు, సునామీ వస్తే టోక్యో నగరంలోకి భారీగా నీరు వస్తుంది. ఆ నీటిని మళ్లించేందుకు నగర శివారులో పెద్ద టన్నెల్స్‌ను ఏర్పాటు చేశారు. తుపానులు, వరదల కారణంగా వచ్చిన నీరు మొత్తం ఈ టన్నెళ్ల ద్వారా ఎడో నదిలోకి మళ్లిస్తారు.

భారత రాయబార కార్యాలయం ఎమర్జెన్సీ రూమ్‌

జపాన్‌లో భూకంప తీవ్రత కారణంగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో టోక్యోలోని భారత రాయబార కార్యాలయం ఎమర్జెన్సీ కాంటాక్ట్‌ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం భారత రాయబార కార్యాలయ సిబ్బంది ఫోన్‌ నంబర్లు, మెయిల్‌ ఐడీలతో ఒక ప్రకటన విడుదల చేసింది. భూకంపం, సునామీకి సంబంధించిన సమాచారం కోసం ఎవరైనా సంప్రదించవచ్చని తెలిపింది.  స్థానిక ప్రభుత్వ సూచనలు పాటించాలని ప్రకటనలో సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు