India-US: ‘చపాతీ’ కాదు.. భారత్‌-అమెరికాది ‘పూరీ’ బంధం..!

India-US: భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు ఇక చపాతీలా చదునుగా లేవని, పూరీ మాదిరిగా పొంగి ఉన్నాయని అగ్రరాజ్య మంత్రి ఒకరు అన్నారు. 

Updated : 06 Feb 2024 11:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌-అమెరికా (India-US) బంధంపై అగ్రరాజ్య ఇంధన వనరుల శాఖ మంత్రి జియోఫ్రే ఆర్‌ ప్యాట్‌  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాన్ని భారతీయ వంటకాలైన చపాతీ, పూరీతో పోలుస్తూ ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు (Trade ties) ఎలా ఉన్నాయో అభివర్ణించారు.

విదేశీ వాణిజ్య ఒప్పందంపై చర్చల నిమిత్తం ఇరు దేశాల ప్రతినిధులు సోమవారం వర్చువల్‌గా సమావేశమయ్యారు. భారత్‌-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణను బలోపేతం చేసే దిశగా ఇందులో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్యాట్‌ మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు రెండు దేశాల మధ్య వాణిజ్య బంధాన్ని ‘చపాతీ’లా ఫ్లాట్‌గా అభివర్ణించలేం. మన బంధం మరింత పెరిగి ‘పూరీ’లా పొంగింది. ప్రస్తుతం మేం భారత్‌తో ఎలాంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలు జరపడంలేదు. కానీ, మా వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా కీలక చర్చలు జరుపుతున్నాం’’ అని అన్నారు.

హెచ్‌-4 వీసాదారులకు ఆటోమేటిక్‌గా ఉద్యోగ అనుమతులు

భారత్‌, అమెరికా వాణిజ్య భాగస్వామ్యం గతంలో పోలిస్తే మరింత విస్తృతమైంది. 2022లో వాషింగ్టన్‌ నుంచి దిల్లీకి 47.2 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి అయ్యాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 17.9శాతం ఎక్కువగా కాగా.. 2012 నాటి స్థాయి కంటే 113శాతం అధికమని గణాంకాలు వెల్లడించాయి. దీన్ని ప్రస్తావిస్తూనే అమెరికా మంత్రి ఇలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఇటీవల ఎర్ర సముద్రంలో డ్రోన్ దాడికి గురైన అమెరికా వాణిజ్య నౌకకు భారత నేవీ సాయం చేసిన ఘటనను ప్యాట్‌ గుర్తుచేసుకున్నారు. ‘‘అంతర్జాతీయంగా సరకు రవాణా వ్యవస్థలో ప్రస్తుతం గందరగోళం నెలకొంది. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలకు ముప్పు పొంచి ఉన్న వేళ అవి దారి మార్చుకొంటున్నాయి. ఇది ద్రవ్యోల్బణంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మనందరికీ తెలుసు. ఇటీవల హూతీలు జరిపిన దాడి నుంచి ఓ అమెరికా నౌకను భారత నేవీ కాపాడింది. న్యూదిల్లీ సామర్థ్యం ఎలాంటిదో.. దానితో బంధం అమెరికాకు ఎంత ప్రయోజనమే చెప్పేందుకు ఆ ఘటనే నిదర్శనం’’ అని అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని