హెచ్‌-4 వీసాదారులకు ఆటోమేటిక్‌గా ఉద్యోగ అనుమతులు

హెచ్‌-4 వీసాదారులకు శుభవార్త! అమెరికాలో వారికి ఉపాధి దొరకడం ఇకపై సులువుకానుంది. సంబంధిత కీలక బిల్లును సెనెట్‌ త్వరలోనే ఆమోదించనుంది.

Updated : 06 Feb 2024 12:58 IST

కీలక బిల్లును ఆమోదించనున్న అమెరికా సెనెట్‌

వాషింగ్టన్‌: హెచ్‌-4 వీసాదారులకు శుభవార్త! అమెరికాలో వారికి ఉపాధి దొరకడం ఇకపై సులువుకానుంది. సంబంధిత కీలక బిల్లును సెనెట్‌ త్వరలోనే ఆమోదించనుంది. దీనివల్ల సుమారు లక్ష మందికి లబ్ధి కలగనుంది. హెచ్‌-1బి వీసాదారుల జీవిత భాగస్వాములు, వారి పిల్లలకు (21 ఏళ్లలోపు వయసున్నవారు) హెచ్‌-4 వీసాలు జారీ చేస్తుంటారు. హెచ్‌-4 వీసాదారులు అమెరికాలో ఉద్యోగం చేయాలంటే తప్పనిసరిగా ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌, ఐ-765 కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆ ప్రక్రియ పూర్తయి అనుమతులు వచ్చేందుకు ఏడాది వరకూ సమయం పడుతుంటుంది. దానివల్ల వారు పలు ఉద్యోగావకాశాలు కోల్పోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత నిబంధనలను మార్చి.. హెచ్‌-4 వీసాదారులకు ఆటోమేటిక్‌గా ఉద్యోగ అనుమతులు మంజూరయ్యేలా రూపొందించిన బిల్లుకు త్వరలోనే ఆమోదం లభించనున్నట్లు శ్వేతసౌధం ఆదివారం వెల్లడించింది. సెనెట్‌లో ఈ మేరకు రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య అంగీకారం కుదిరినట్లు తెలిపింది. హెచ్‌-1బి వీసాదారుల పిల్లలు 8 ఏళ్లపాటు హెచ్‌-4 వీసాను కలిగి ఉంటే.. వారి వయో పరిమితి ముగిసినప్పటికీ అమెరికాలో కొనసాగుతూ ఉద్యోగం చేసుకునేందుకూ ఈ బిల్లు వీలు కల్పించనుంది. ఈ విధానం కింద రాబోయే అయిదేళ్లపాటు ఏటా 18 వేల మందికి ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డ్‌లను జారీ చేయనున్నారు. జాతీయ భద్రత ఒప్పందం పేరుతో తీసుకొస్తున్న ఈ బిల్లు అమెరికాను బలోపేతం చేయడంతోపాటు సరిహద్దులను సురక్షితంగా మారుస్తుందని దేశాధ్యక్షుడు బైడెన్‌ పేర్కొన్నారు. తాజా బిల్లుతో భారతీయులకు ప్రయోజనం చేకూరనుంది. హెచ్‌-4 వీసాదారులు అమెరికాలో ఉద్యోగం చేసుకొనే అవకాశం కల్పిస్తూ.. 2015లో ఒబామా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిపై ఆంక్షలు విధించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని