Justin Trudeau: ఆ ఘటన కెనడియన్లను ఇబ్బందికి గురిచేసేదే..: జస్టిన్‌ ట్రూడో

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau) వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల పార్లమెంట్‌ వేదికగా జరిగిన ఘటన విషయంలో ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. 

Updated : 26 Sep 2023 12:42 IST

టొరంటో: జర్మనీ నియంత హిట్లర్‌తో కలిసి పోరాడిన నాజీ డివిజన్ సైనికుడిని పార్లమెంట్‌ సాక్షిగా గౌరవించి కెనడా(Canada) ప్రధాని జస్టిన్‌ ట్రూడో(Justin Trudeau) ప్రభుత్వం వివాదంలో చిక్కుకుంది. దీనిపై మొదటిసారి ట్రూడో స్పందించారు. ‘ఇది కెనడా పార్లమెంట్‌కు, కెనడియన్లందరికీ అత్యంత ఇబ్బందికర పరిణామం. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యమైంది కాదు’ అని తన ప్రభుత్వంపై వస్తోన్న విమర్శలను ఉద్దేశించి బదులిచ్చారు.

రష్యాతో యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటీవల తొలిసారి కెనడాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గత శుక్రవారం పార్లమెంట్‌కు వచ్చారు. ఈ కార్యక్రమానికి స్పీకర్‌ ఆంటోనీ రోటా ఉక్రెయిన్‌ నుంచి వలస వచ్చిన రెండో ప్రపంచ యుద్ధం మాజీ సైనికుడైన 98 ఏళ్ల యారోస్లోవ్‌ హంకాను ఆహ్వానించారు. పార్లమెంట్‌లో జెలెన్‌స్కీ ప్రసంగం అనంతరం స్పీకర్‌ రోటా స్వయంగా హంకాను పరిచయం చేస్తూ.. రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా నుంచి ఉక్రెయిన్‌కు స్వేచ్ఛను అందించడానికి పోరాడిన యోధుడిగా కీర్తించారు. దీంతో అక్కడే ఉన్న ప్రధాని జస్టిన్‌ ట్రూడో(Justin Trudeau), ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Volodymyr Zelenskyy) సహా అందరూ చప్పట్లు కొడుతూ లేచి నిలబడ్డారు.

భారత్‌ కీలక భాగస్వామే.. కానీ..!

కెనడాలోని ‘ది ఫ్రెండ్స్‌ ఆఫ్‌ సైమన్‌ వెసింతల్‌ సెంటర్‌’ ప్రతినిధులు పార్లమెంట్‌ చర్యను ఖండించారు. హంకా చేతులు యూదుల రక్తంతో తడిశాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన కెనడా హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ స్పీకర్‌ ఆంటోని రోటా ఆ తర్వాత తీరిగ్గా యూదులకు క్షమాపణలు చెప్పారు. హంకా గురించి ఎలాంటి వివరాలు తెలుసుకోకుండా, ముందస్తు నోటీసు ఇవ్వకుండా అతడిని ఆహ్వానించారంటూ విపక్షాలు ట్రూడో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. అలాగే స్పీకర్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.

హంకాను పార్లమెంట్‌లో సత్కరించడాన్ని రష్యా(Russia) తీవ్రంగా పరిగణించింది. కెనడా చర్య అత్యంత దారుణమని, నాజీల నేరాలను గుర్తుంచుకోవాలని సూచించింది. స్పీకర్ చెప్పిన క్షమాపణలపై కెనడాలోని పోలండ్ రాయబారి స్పందించారు. నాజీ డివిజన్ పోలండ్‌ ప్రజలపై జరిపిన అకృత్యాలను గుర్తుచేసుకుంటే ఈ క్షమాపణ సరిపోదని వ్యాఖ్యానించారు. కెనడా పార్లమెంట్ సాక్షిగా నాజీ సైనికుడికి జరిగిన సత్కారం తీవ్రంగా బాధించిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని