భారత్‌ కీలక భాగస్వామే.. కానీ..!

ఖలిస్థాన్‌ ఉగ్రవాదులకు కెనడా స్వర్గధామంగా మారిందన్న ఆరోపణలకు మరింత బలం చేకూర్చే ఆధారాలను దిల్లీ పోలీసులు సంపాదించారు.

Updated : 26 Sep 2023 06:08 IST

మా పౌరుల ప్రాణాలూ ముఖ్యమే
నిజ్జర్‌ హత్యపై నిజాలు వెలికి తీస్తాం
దర్యాప్తునకు భారత్‌ సహకరించాలి
కెనడా రక్షణ మంత్రి బిల్‌ బ్లెయిర్‌ వ్యాఖ్యలు

టొరంటో: ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు సంబంధించిన అంశంలో భారత్‌, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వివాదంపై కెనడా రక్షణ మంత్రి బిల్‌ బ్లెయిర్‌ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో బంధం తమకు ‘ముఖ్యమైనదే’ అని పేర్కొన్న ఆయన.. నిజ్జర్‌ హత్యకు సంబంధించి తమ దగ్గర విశ్వసనీయ సమాచారం ఉందని తెలిపారు. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ కీలక భాగస్వామి అని.. అదే సమయంలో దేశ సార్వభౌమత్వం.. పౌరుల ప్రాణాలు కూడా తమకు చాలా విలువైనవని పేర్కొన్నారు. నిజ్జర్‌ హత్యలో తమ దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయని, దీనికి భారత్‌ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘మా చట్టాలను గౌరవించడం, మా పౌరులను రక్షించుకోవడం మా బాధ్యత. అందుకోసం.. ఈ కేసులో క్షుణ్ణంగా దర్యాప్తు జరిపి అసలు నిజాన్ని వెలికితీయాల్సిన బాధ్యత మాపై ఉంది. మా గడ్డపై మా పౌరుడిని (నిజ్జర్‌ను ఉద్దేశిస్తూ) హత్య చేయడం మా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే’’ అని బ్లెయిర్‌ వ్యాఖ్యానించారు. 2020లో ఉగ్రవాదిగా భారత్‌ ప్రకటించిన నిజ్జర్‌ను ఈ ఏడాది జూన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కెనడాలో హత్య చేశారు. అయితే దీని వెనుక భారత్‌ నిఘా సంస్థల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపణలు చేయడం వివాదాస్పదమెంiది. ఈ ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించింది.

 పోస్టర్లను తొలగించిన కెనడా!

ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా కేంద్రంగా మారిందని భారత్‌ చేస్తున్న ఆరోపణలు అక్కడి అధికారులకు కలవరం పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలో బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రేలోని గురుద్వారా వద్ద ఉన్న ఖలిస్థానీ సంస్థలకు చెందిన బెదిరింపు పోస్టర్లను తొలగించే పనిలో పడ్డారు. జూన్‌లో... ఈ ప్రాంతంలోనే నిజ్జర్‌ హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత కెనడాలోని ముగ్గురు భారత దౌత్యవేత్తలను హత్యచేయాలని పిలుపునిస్తూ గురుద్వారా పరిసరాల్లో పోస్టర్లు వెలిశాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో వీటిని తొలగించాలని స్థానిక అధికారులు గురుద్వారా వర్గాలపై ఒత్తిడి తెచ్చారు. దీంతోపాటు విద్వేష ప్రకటనలకు లౌడ్‌ స్పీకర్‌ను వినియోగించకూడదని ఆంక్షలు విధించారు. తాజాగా కొందరు వ్యక్తులు ఈ పోస్టర్లను తొలగిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

మరో నిజ్జర్‌.. డల్లా!

ఖలిస్థాన్‌ ఉగ్రవాదులకు కెనడా స్వర్గధామంగా మారిందన్న ఆరోపణలకు మరింత బలం చేకూర్చే ఆధారాలను దిల్లీ పోలీసులు సంపాదించారు. ఆ దేశంలో ఆశ్రయం పొందుతున్న అర్ష్‌దీప్‌ సింగ్‌ అలియాస్‌ అర్ష్‌ డల్లాకు జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్న లష్కరే తోయిబాతో సంబంధాలున్నట్లు గుర్తించారు. పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన 27 ఏళ్ల డల్లాపై భారత్‌లో 25కు పైగా కేసులున్నాయి. ఇటీవల దిల్లీ పోలీసులు ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒక వ్యక్తి.. తాను డల్లాతో టచ్‌లో ఉన్నట్లు అంగీకరించాడు. డల్లా ఆదేశాల మేరకే.. దిల్లీలో తాను ఓ హిందూ బాలుడిని హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు. పంజాబ్‌లో కల్లోలం సృష్టించేందుకు తమకు డల్లా నుంచి ఆయుధాలు అందుతున్నాయని అతడు చెప్పినట్లు పోలీసులు తమ ఛార్జ్‌షీట్‌ లో వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని