Iran: ఎవరయ్యేను ఖమేనీ వారసుడు?

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంతో ఆ దేశ భవితవ్యంపై అంతర్గతంగానే కాకుండా అంతర్జాతీయంగానూ ఆసక్తి పెరుగుతోంది. తదుపరి అధ్యక్షుడు ఎవరనేది కాకుండా... దేశ సుప్రీం కమాండర్‌ ఎవరవుతారనేది అందరిలో తలెత్తుతున్న ప్రశ్న!

Published : 22 May 2024 06:18 IST

రైసీ మరణంతో ఇరాన్‌ భవితపై చర్చ

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంతో ఆ దేశ భవితవ్యంపై అంతర్గతంగానే కాకుండా అంతర్జాతీయంగానూ ఆసక్తి పెరుగుతోంది. తదుపరి అధ్యక్షుడు ఎవరనేది కాకుండా... దేశ సుప్రీం కమాండర్‌ ఎవరవుతారనేది అందరిలో తలెత్తుతున్న ప్రశ్న!

అంతా ఆయన చేతుల్లోనే...

మామూలుగానైతే... అధ్యక్షుడి స్థానం ఖాళీ అయ్యింది కాబట్టి తదుపరి అధ్యక్షుడు ఎవరనేది చర్చనీయాంశం అవుతుంది. కానీ... ఇరాన్‌లోని ప్రత్యేక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా... కొత్త అధ్యక్షుడి కంటే కూడా... ఆ దేశ సుప్రీంకమాండర్‌ స్థానంపై ఇప్పుడు చర్చ మొదలైంది. కారణం... ఇరాన్‌లో ఆ పదవే కీలకం! ప్రజల ఓటుతో ఎన్నికైనా ఇరాన్‌ అధ్యక్షుడి అధికారాలు పరిమితమే! మత పెద్ద ఆయతుల్లా ఖమేనీయే ప్రస్తుత సుప్రీం కమాండర్‌! 85 ఏళ్ల వయసున్న ఆయనే ఇరాన్‌ను నడిపిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, పాలన, బడ్జెట్‌లాంటివి చూసుకోవటమే అధ్యక్షుడి పని. విదేశాంగ విధానం, రక్షణ, భద్రత బలగాలు, సైన్యం, న్యాయవ్యవస్థ, మీడియా ఇవన్నీ సుప్రీం కమాండర్‌ చేతుల్లో ఉంటాయి. ఆయన ఆశీస్సులు ఉన్నవారే ఎన్నికల్లో పోటీ చేయగలుగుతారు. అధ్యక్ష పీఠం ఎక్కగలుగుతారు. ఆయన్ను కాదని ఎవ్వరూ ఏమీ చేయలేరు. 2017 అధ్యక్ష ఎన్నికల్లో హసన్‌ రౌహని చేతిలో రైసీ పరాజయం పాలయ్యారు. ఎన్నికయ్యాక హసన్‌ మితవాద పంథా ఎంచుకోవటం ఖమేనీకి నచ్చలేదు.

ఫలితంగా.. 2021 ఎన్నికల్లో ఆయనను అనర్హుడిగా తేల్చేశారు. అత్యంత తక్కువ పోలింగ్‌ నమోదైన ఆ ఎన్నికల్లో ఖమేనీ బంటు రైసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంతేగాకుండా క్రమంగా దేశ రాజకీయాలపై రైసీ తన పట్టుబిగిస్తూ వచ్చారు. ఎంతగా అంటే.. ఖమేనీ తర్వాత సుప్రీం కమాండర్‌ పదవీ రైసీకే దక్కుతుందని అంతా భావించేంతగా! అయితే.. సుప్రీం కమాండర్‌ ఖమేనీ రెండో కుమారుడు మొజ్తబా ఖమేనీ కూడా తండ్రి వారసత్వాన్ని అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. రైసీ రంగంలో లేకుంటే మొజ్తబాకు మార్గం సుగమమవుతుందనే  వాదనా ఉంది. ఇజ్రాయెల్‌ హస్తంతో పాటు.. ప్రస్తుత ప్రమాదాన్ని ఆ కోణంలో చూస్తున్నవారూ లేకపోలేదు. ఆయతుల్లా ఖమేనీ తన వారసుడిగా కొడుకును ఎంచుకుంటారా? లేక మరెవరికైనా అవకాశం ఇస్తారా అనేది చూడాలి. దీంతోపాటు... రైసీ సారథ్యంలో మానవ హక్కులను అణచివేసిన దేశంగా పేరు తెచ్చుకున్న ఇరాన్‌.. ఇకముందు కూడా అదే కాఠిన్యాన్ని ప్రదర్శిస్తుందా లేక.. మళ్లీ ఉదారవాదులకు దారులు తెరచుకుంటాయా అనేదీ ఆసక్తికరాంశమే!

ఎందుకంటే...

పైకి గంభీరంగా కనిపిస్తున్నా ఇరాన్‌ ప్రస్తుతం ఇంటా బయటా ఒత్తిళ్లతో సతమతమవుతోంది. తన సైనిక ఉన్నతాధికారులు, అణు శాస్త్రవేత్తలను ఇజ్రాయెల్‌ బహిరంగంగానే మట్టుబెడుతోంది. అయినా గట్టిగా స్పందించలేని పరిస్థితి! ఇటీవల ఇజ్రాయెల్‌పై క్షిపణులతో దాడి చేసినా పెద్దగా ఒరిగిందేమీ లేదు. హక్కుల ఉల్లంఘనకు తోడు అణు కార్యక్రమాలు తదితరాల కారణంగా ఇరాన్‌పై అంతర్జాతీయ సమాజం కఠిన ఆంక్షలు విధించి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అరబ్‌ ప్రపంచంలో ఇరాన్‌కున్న కొంతమంది మద్దతుదారులూ ఒత్తిడిలో ఉన్నారు. హమాస్‌లాంటివి ఇజ్రాయెల్‌తో యుద్ధం రూపంలో ఇరుక్కుపోయాయి. ఇటు అంతర్గతంగానూ ఇరాన్‌ అతివాద మతప్రభుత్వానికి బలమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. ద్రవ్యోల్బణం భారీగా పెరిగి సామాన్యుల జీవనం అతలాకుతలమవుతోంది. దీనికి తోడు మతవాద, మితవాదుల మధ్య పోరులో ప్రజలు నలిగిపోతున్నారు. 1979లో ఇస్లామిక్‌ విప్లవం ద్వారా అధికారంలోకి వచ్చిన మతవాద, అతివాద శక్తులకు ఇబ్రహీం రైసీ ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు.

ఇరాన్‌ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ అడుగుజాడల్లో నడుస్తూ 2021లో అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుంచీ రైసీ.. దేశంలో హక్కుల ఆందోళనల పట్ల తీవ్రంగా స్పందించారు. అతివాద పంథాను బలంగా నమ్మిన ఆయన ఉద్యమాలన్నింటినీ ఉక్కుపాదంతో అణచివేశారు. ఫలితంగా ఏడాదిలోనే ఇరాన్‌లో వందల మంది చంపివేశారు. మతవాదానికి పెద్దపీట వేస్తూ.. మితవాదుల పట్ల కఠినంగా వ్యవహరించారు. ముఖ్యంగా హిజాబ్‌ వ్యతిరేక ప్రదర్శనలనైతే బలంగా అణచివేశారు. అధ్యక్ష పదవిని చేపట్టడానికి ముందు నుంచీ రైసీ ఇదే ధోరణిని ప్రదర్శించారని, వేలమందిని చంపించారని ఆరోపణలున్నాయి. ఆయన్ను.. ‘తెహ్రాన్‌ తలారి’గా పిలుస్తారు కూడా! మతపెద్దగా, ప్రాసిక్యూటర్‌గా 20 ఏళ్ల వయసులోనే దేశరాజకీయాలపై రైసీ బలమైన ముద్రవేశారు. 1988లో సుప్రీం కమాండర్‌ ఆయతుల్లా ఖమేనీ ఆదేశాల మేరకు.. మరణదండన కమిటీ సభ్యుడిగా దాదాపు 8వేల మంది రాజకీయ ఖైదీలను నిర్దాక్షిణ్యంగా ఉరికంబం ఎక్కించటంలో రైసీ కీలక పాత్ర పోషించారని అంటారు. ఆ పాత్రే ఆయనను 2021లో అధ్యక్షపదవి దాకా తీసుకొని వచ్చింది.

ఈ రాజకీయ చదరంగంలో ఏ పావులెటు కదులుతాయోగాని.. రైసీ మరణంతో, త్వరలో రాబోయే ఎన్నికలతో మళ్లీ దేశంలోని ఉదారవాదులు తమ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే.. ప్రభుత్వం ఎంతగా అణచివేస్తున్నా ఉద్యమాలు ఏదో రూపంలో కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికలు సజావుగా జరిగితే.. అతివాదులకు ఇబ్బందికర ఫలితాలు వచ్చే అవకాశాలే ఎక్కువ. మరి సుప్రీం కమాండర్‌ ఖమేనీ అందుకు అవకాశం కల్పిస్తారా? మితవాద నాయకులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తారా? లేక మరింత ఉక్కుపాదం మోపటానికే మొగ్గు చూపుతారా? అనేది ఆసక్తికర అంశం! వీటన్నింటి మధ్య.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇరుసులాంటి ఇరాన్‌ సైన్యం, ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌ ఎలాంటి పాత్ర పోషిస్తుందనేదీ వేచి చూడాల్సిందే!

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని