Trump-Tesla: టెస్లాపై దాడి చేస్తే 20 ఏళ్ల జైలు: ట్రంప్‌

Eenadu icon
By International News Team Updated : 21 Mar 2025 12:07 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న సంపన్నుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) యాజమాన్యంలోని టెస్లా విద్యుత్‌ కార్ల (Tesla Cars) సంస్థకు చెందిన ఆస్తులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఈనేపథ్యంలో ట్రంప్‌ నుంచి స్పందన వచ్చింది. టెస్లా కార్లపై దాడికి పాల్పడేవారికి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడేందుకు మంచి అవకాశం ఉందని వ్యంగ్యంగా పోస్టు పెట్టారు. ఈ దాడులను ప్రోత్సహిస్తోన్న వారికి కూడా శిక్ష తప్పదని హెచ్చరించారు.  

అమెరికా, ఇతర దేశాల్లో టెస్లా షోరూమ్‌లు, విద్యుత్‌ ఛార్జింగ్‌ స్టేషన్లతోపాటు కార్ల పైనా ఇటీవల దాడులు చోటుచేసుకున్నాయి. భద్రత కరవైందన్న కారణంగా కెనడాలో అంతర్జాతీయ వాహన ప్రదర్శన నుంచి టెస్లా తన ఉత్పాదనలను ఉపసంహరించుకుంది. మస్క్‌ను ప్రభుత్వ సామర్థ్య పెంపుదల విభాగం (డోజ్‌) అధినేతగా ట్రంప్‌ నియమించినప్పటి నుంచీ టెస్లాపై దాడులు బాగా పెరిగిపోయాయి. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించాలన్న మస్క్‌ సలహా మేరకు ట్రంప్‌ ప్రభుత్వం ఎందరో ప్రభుత్వోద్యోగులకు ఉద్వాసన పలకడంతోపాటు పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. మస్క్‌ విధానాలను వ్యతిరేకిస్తున్నవారు ఉత్తర అమెరికా, యూరప్‌లలోని ఆయన కార్యాలయాలు, కర్మాగారాల ఎదుట ఆందోళనలు నిర్వహించారు. మస్క్‌తో విభేదిస్తున్న పలువురు సెనేటర్లు తమ టెస్లా కార్లను విక్రయించేస్తామని ప్రతినబూనారు.

మరోవైపు లాస్‌వెగాస్‌లో టెస్లా షోరూంలోని ఐదు కార్లకు దుండగులు నిప్పంటించారు. అనంతరం ఒక కారుపై అభ్యంతరకర పదజాలంతో స్ప్రే పెయింట్‌ వేశారు. టెస్లా ఉత్పత్తి చేసిన వాహనాలపై పేలుడు పదార్థాన్ని విసిరిన ఘటనకు సంబంధించి పోలీసులు గత నెలలో ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు. చార్లెస్టన్‌ సమీపంలో టెస్లా ఛార్జింగ్‌ స్టేషన్లను తగలబెట్టిన ఒక వ్యక్తిని సౌత్‌ కరోలినాలో అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. టెస్లాపై దాడులకు దిగేవారు నరకాన్ని అనుభవించబోతున్నారని ట్రంప్‌ హెచ్చరించారు. ఈక్రమంలోనే తన సోషల్ మీడియా ట్రూత్‌లో పోస్టు పెట్టారు.

ఇదిలాఉంటే.. ఇటీవల తన మిత్రుడు మస్క్‌కు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. మాటిచ్చినట్టుగానే టెస్లా కారు కొనుగోలు చేశారు. అధ్యక్షుడి కోసం టెస్లా అధినేత ఏకంగా 5 కార్లను వైట్‌హౌస్‌కు తీసుకురావడం విశేషం. వీటి ఫీచర్లను తానే దగ్గరుండి వివరించారు. అందులోనుంచి ఎరుపురంగు కారును ట్రంప్‌ ఎంపిక చేసుకున్నారు. డ్రైవింగు సీట్లో అధ్యక్షుడు కూర్చోగా, ఆ పక్కనే ఉన్న మస్క్‌..‘‘ఇది వేగంగా వెళ్లే కారు. సీక్రెట్‌ సర్వీసుకు ఓసారి షాక్‌ ఇద్దామా?’’ అని సరదాగా జోక్‌ చేశారు. అయితే, వాహనాన్ని నడిపేందుకు ట్రంప్‌నకు అనుమతి లేనందున ఆయన టెస్ట్‌ డ్రైవింగుకు వెళ్లలేదు.

Tags :
Published : 21 Mar 2025 11:46 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు