Tuvalu: భవిష్యత్తులో.. ఇంట్లోనే ఉండి మీరు ఈ దేశానికి వెళ్లొచ్చు..!

సముద్ర మట్టాలు పెరిగి తమ దేశ భూభాగం కనుమరుగైపోతుండటంతో.. ఓ ద్వీప దేశం కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తు తరాలకు తమ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేందుకు తమ దేశాన్ని డిజిటల్ దేశంగా మార్చేయనుంది.

Updated : 28 Feb 2023 12:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పర్యావరణ పరిరక్షణకు కఠిన చర్యలు చేపడతామని ప్రతి ఏటా ప్రపంచదేశాలు తీర్మానాలు చేస్తున్నాయి. కానీ, అవి కేవలం నీటి మీద రాతలుగానే ఉండిపోతున్నాయి. దీంతో కర్బన ఉద్గారాల కారణంగా నీటి మట్టాలు (Sea Levels) పెరిగిపోతుండటంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని ద్వీప (Island) దేశాల  భూభాగాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ద్వీప దేశం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో తమ దేశాన్ని డిజిటల్‌ దేశం (Digital Country)గా మారుస్తామని ప్రకటించింది. అదే తువాలు (Tuvalu) ఐలాండ్‌.

ఇది ఆస్ట్రేలియా (Australia), హవాయి (Hawaii)ల మధ్య  ఉంది. ఇది తొమ్మిది దీవుల సమూహం. ఇక్కడ 12 వేల మంది నివసిస్తున్నారు. ఇప్పటికే తువాలు రాజధాని ప్రాంతం 40 శాతం సముద్రంలో కలిసిపోయింది. ఇదిలాగే కొనసాగితే ఈ దశాబ్దం చివరికి తువాలు పూర్తిగా కనుమరుగైపోవడమే కాకుండా, ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్‌కు బలయ్యే తొలి ద్వీపం ఇదే కానుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

అందుకే భవిష్యత్తు తరాలకు తువాలు దేశ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేందుకు మెటావర్స్‌ (Metaverse)లో ఈ దేశాన్ని రూపొందించనున్నట్లు ఆ దేశ న్యాయ, సమాచార, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సైమన్‌ కోఫే తెలిపారు. రాబోయే రోజుల్లో తువాలు కనుమరుగైనా.. మెటావర్స్‌ ద్వారా అక్కడి ప్రకృతి అందాలను, ప్రజల జీవనశైలిని పర్యాటకులు చూడొచ్చు.

‘‘ఇక్కడి భూమి, సముద్రం, సంస్కృతి.. తువాలు ప్రజల విశిష్ట సంపద. గత కొన్నేళ్లుగా వాతావరణంలో చోటుచేసుకుంటున్న పరిస్థితుల కారణంగా సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి. దీంతో మా దేశ భూమిలో కొద్ది కొద్దిగా కనుమరుగైపోతుంది. భవిష్యత్తులో తువాలు ఉనికి ప్రపంచదేశాలకు తెలియాలంటే మా దేశాన్ని పూర్తి డిజిటల్‌ నేషన్‌గా మార్చడం మినహా మరో దారిలేదు. త్వరలోనే తువాలు తొలి వర్చువల్‌ దేశంగా ప్రపంచ ప్రజలకు దర్శనమివ్వబోతుంది’’ అని సైమన్‌ తెలిపారు. 

తువాలును మెటావర్స్‌ దేశంగా మార్చేందుకు ది మంకీస్‌ (The Monkeys), కొల్లైడర్‌ (Collider) అనే రెండు సంస్థలు పనిచేస్తున్నాయి. ఇందులో తువాలు చరిత్రకు సంబంధించిన డాక్యుమెంట్‌లు, సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన వివరాలు, కుటుంబ ఫొటోలు, సంప్రదాయ పాటలు వంటి వాటిని నిక్షిప్తం చేయనున్నారు. ఇప్పటికే ఐలాండ్‌ దేశం బార్బడోస్‌ (Barbados), దక్షిణ కొరియా (South Korea) రాజధాని సియోల్‌(Seoul)లు అడ్మినిస్ట్రేటివ్, కాన్సులేట్ సేవలను మెటావర్స్ ద్వారా అందిస్తామని గతేడాది ప్రకటించాయి. కానీ, పూర్తిగా ఒక దేశం మెటావర్స్‌లోకి మారిపోవడం ఇదే తొలిసారి. అలా తొలి డిజిటల్‌ నేషన్‌గా తువాలు మెటావర్స్‌లో నిలిచిపోతుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని