Crimea: ఒకే రోజు రెండు రష్యా నౌకలను ధ్వంసం చేసిన ఉక్రెయిన్‌..!

రష్యాకు చెందిన రెండు భారీ ల్యాండింగ్‌ షిప్‌లను ఉక్రెయిన్‌ ఓకే రోజు ధ్వంసం చేసింది. దీంతో మొత్తం రష్యా ఈ యుద్ధంలో 20 నౌకలను నష్టపోయినట్లైంది. 

Updated : 25 Mar 2024 11:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌(Ukraine)తో జరుగుతున్న యుద్ధంలో రష్యా(Russia)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నల్లసముద్ర దళంలోని రెండు కీలక నౌకలను కీవ్‌ దళాలు ఒకే రోజు ధ్వంసం చేశాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ జనరల్‌ స్టాఫ్‌ విభాగం ప్రకటించింది. యమాల్‌, ఆజోవ్‌ ల్యాండింగ్‌ షిప్స్‌ను  పేల్చివేసినట్లు తెలిపింది. మరోవైపు యూకే రక్షణ మంత్రి గ్రాంట్‌ షాంప్స్‌మ మాట్లాడుతూ ఉక్రెయిన్‌ చర్య చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. ‘‘పుతిన్‌ నల్ల సముద్రం నుంచి సురక్షితంగా పోరాడే అవకాశం లేదు. 1783 నుంచి రష్యా బ్లాక్‌ సీ దళం నిర్వహిస్తున్నా ప్రయోజనం లేదు’’ అని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌ ఓటమిని ప్రపంచం తట్టుకోలేదని షాంప్స్‌ పేర్కొన్నారు. రష్యా దాడులను తట్టుకొనేలా కీవ్‌కు తాము అండగా ఉంటామన్నారు. తాజా దాడితో రష్యాకు ఇక కేవలం మూడు ల్యాండింగ్‌ షిప్‌లు మాత్రమే నల్ల సముద్రంలో మిగిలినట్లైంది. యుద్ధం మొదలు  సమయంలో మాస్కో వద్ద ఇటువంటివి 13 నౌకలు ఉండేవి. 

వారు ఉక్రెయిన్‌కు పారిపోవాలనుకున్నారు

మరోవైపు రష్యా నియమించిన సెవస్టపోల్‌ గవర్నర్‌ మాట్లాడుతూ ఉక్రెయిన్‌ దాడిలో స్థానిక నివాస భవనాలు, రవాణా వ్యవస్థలు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. వీటికి సంబంధించిన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచురించవద్దని ప్రజలను కోరారు. 17 బస్సులు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. ఇక కీవ్‌ ప్రయోగించిన 10 క్షిపణులను కూల్చివేశామని చెప్పారు. 

యుద్ధం మొదలైన నాటి నుంచి దాదాపు 20 రష్యా యుద్ధ నౌకలను ఉక్రెయిన్‌ ధ్వంసం చేసింది. దీంతో ఇక్కడ ఉన్న బ్లాక్‌సీ దళంలోని మూడోవంతు నౌకలను ముంచేసినట్లైంది. వాస్తవానికి ఉక్రెయిన్‌కు అసలు నౌకాదళం అనేదే లేకుండా ఈ స్థాయిలో రష్యాకు నష్టం కలిగించడం విశేషం. ఉక్రెయిన్‌ దాడులను తట్టుకోలేక గతేడాది రష్యా చాలా వరకు బ్లాక్‌ సీ నౌకాదళాన్ని ఇతర ప్రాంతాలకు తరలించింది. సెప్టెంబర్లో సెవస్టపోల్‌లోని నౌకాదళ ప్రధాన స్థావరాన్ని కూడా ఉక్రెయిన్‌ ధ్వంసం చేసింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని