Rishi Sunak: ఆ విషయాల్లో ఇద్దరమూ ఒక్కటే.. రిషి దంపతుల ఆసక్తికర పోస్ట్‌

బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, ఆయన సతీమణి అక్షతామూర్తి సంయుక్తంగా సోషల్‌మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టారు. దాంపత్య జీవితంలో వారి అభిరుచులు, అనుసరిస్తున్న విధానం, విలువల గురించి తెలియజేశారు.

Published : 27 May 2024 15:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మరికొన్ని రోజుల్లో బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశ ప్రధానమంత్రి రిషి సునాక్‌ (Rishi Sunak and Akshata Murty) దంపతులు కీలక విషయాలు వెల్లడించారు. ఇద్దరి అభిరుచులకు సంబంధించి అనేకమంది అడిగే ప్రశ్నలను ప్రస్తావిస్తూ సోషల్‌ మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టారు. దాంపత్య జీవితంలో వారి అభిరుచులు, పనిపట్ల నిబద్ధత, తాము అనుసరించే మానవ విలువల గురించి అందులో వివరించారు.

‘‘మేమిద్దరం కలిసి ఎక్కడికి వెళ్లినా ఇతరుల నుంచి ఎదురయ్యే మొదటి ప్రశ్న.. మీలో కామన్‌గా కనిపించే విషయం ఏంటి? అని. దాంపత్య జీవితంలో కలిసి సినిమాలు చూడడం, నచ్చిన ఆహారాన్ని తినడం మాత్రమే కాదు. అంతకన్నా ముఖ్యమైన విషయం ఉంది. అదే విలువలను పంచుకోవడం. జీవితంలో ఏ స్థాయిలో ఉండాలో మన కష్టమే నిర్ణయిస్తుంది. దాన్నే మేమిద్దరం విశ్వసిస్తాం. ఏదైనా సాధించాలంటే మాత్రం సాహసోపేతమైన నిర్ణయాలు అవసరమనే విషయంలోనూ ఇద్దరిదీ ఒకటే మాట. దాని ఫలితంగా మనకంటే మెరుగైన ప్రపంచాన్ని మన పిల్లలు వారసత్వంగా పొందుతారని మా విశ్వాసం. ప్రజలతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవడం అనే విలువలను వారికి పంచుతున్నాం’’ అని పోస్టు పెట్టారు.

చైనాతో కలిసి పనిచేసేందుకు సిద్ధం

రిషి, అక్షతా సంయుక్తంగా పెట్టిన ఈ పోస్టుకు తమ ఫొటోను జత చేశారు. ఇది నెట్టింట వైరల్‌గా మారింది. దాంపత్య జీవితంలో పాటిస్తున్న విలువలు, సహకారం, భవిష్యత్తుపై వారికి ఉన్న నిబద్ధత, ముందుచూపుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలాఉండగా.. జులై 4న ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో భర్త సునాక్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తానని అక్షతా వెల్లడించారు. తాజాగా వీరిద్దరూ పెట్టిన పోస్టు అందరినీ ఆకట్టుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు