Ukraine: తొలిసారి రష్యా వాణిజ్య పోర్టుపై ఉక్రెయిన్‌ సముద్ర డ్రోన్‌ దాడి..!

ఉక్రెయిన్‌కు చెందిన సముద్ర డ్రోన్‌ మరోమారు దాడులకు దిగింది. ఈ దాడిలో నౌకాశ్రయానికి ఎంత నష్టం వాటిల్లిందో తెలియరాలేదు. 

Published : 04 Aug 2023 11:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యాపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులు ఎడతెరిపిలేకుండా సాగుతున్నాయి. తాజాగా నల్లసముద్రంలో రష్యాకు చెందిన పోర్టు నోవోరోసిస్క్‌పై శుక్రవారం ఓ సముద్ర డ్రోన్‌ దాడి చేసింది. ఈ ఓడరేవు రష్యా ఎగుమతులకు అత్యంత కీలకమైంది. దీంతో ఈ పోర్టులో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక్కడ చమురు టర్మినల్‌ను నిర్వహించే కాస్పియన్‌ పైప్‌లైన్‌ కన్సార్టియం ఈ విషయాన్ని వెల్లడించింది.

ఇక్కడ భారీ ఎత్తున కాల్పులు, పేలుళ్ల శబ్దాలను విన్నట్లు రష్యన్‌ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు చెబుతున్నారు. దీనిని నోవోరోసిస్క్‌ ఎమర్జెన్సీ సర్వీసు బృందాలు కూడా ధ్రువీకరించాయి. దీంతో తొలిసారి రష్యా వాణిజ్య పోర్టుపై ఉక్రెయిన్‌ దాడి చేసినట్లైంది. ఇక్కడి నుంచి కాస్పియన్‌ పైప్‌లైన్‌ కన్సార్టియం చమురును ట్యాంకర్లలో నింపుతుంటుంది. తాజాగా ఆ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. పౌర నౌకలకు రక్షణగా వెళుతున్న సైనిక ఓడలపై దాడులు జరిగినట్లు రష్యా ప్రభుత్వం పేర్కొంది. ఈ దాడిని తాము తిప్పికొట్టామని వెల్లడించింది. తమ నౌక ఆ డ్రోన్‌ను పేల్చివేసిందని చెప్పింది. 

రష్యాను ముప్పుతిప్పలు పెడుతున్న కిల్లర్‌ డ్రోన్లు..!

ఉక్రెయిన్‌ వద్ద ఉన్న మారిటైం అన్‌మ్యాన్డ్‌ సర్ఫేస్‌ వెస్సల్స్‌ (యూఎస్‌వీ)పై రష్యా నౌకాదళంలో ఆందోళన వ్యక్తం అవుతోంది. క్రిమియాలోని రష్యా నౌకాదళ స్థావరం ఉన్న సెవస్తపొల్‌పై ఈ రకం బోట్లు తరచూ దాడులు చేస్తున్నాయి. గతేడాది అక్టోబర్‌లో తొలిసారి ఏడు సముద్ర డ్రోన్లు రష్యా దళాలపై దాడికి దిగాయి. 5.5 మీటర్ల పొడవు, టన్ను బరువుండే ఈ డ్రోన్లకు 60 గంటల పాటు 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం ఉంది. వీటిల్లో 200 కిలోల పేలుడు పదార్థాలను కూడా అమర్చవచ్చు.

గత నెల నల్లసముద్రపు ధాన్యం ఒప్పందం నుంచి రష్యా వైదొలగిన నాటి నుంచి ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఉక్రెయిన్‌లోని మూడు ప్రధాన పోర్టులపై రష్యా ఎడతెరిపిలేకుండా దాడులు చేస్తోంది. మరోవైపు ఉక్రెయిన్‌ కూడా డ్రోన్‌ దాడులను తీవ్రతరం చేసింది. తాజాగా క్రిమియాపైకి వచ్చిన 10 డ్రోన్లను తాము కూల్చేసినట్లు రష్యా వెల్లడించింది. ‘‘క్రిమియాలోని ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ పలు ఆపదలను ధ్వంసం చేసింది’’ అని క్రిమియా ప్రతినిధి ఓల్గె క్రూచ్కోవ్‌ పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని