Ukraine: ఉత్తర కొరియా రాకెట్లతో రష్యాపై ఎదురుదాడులు..!

రష్యాపై ఎదురుదాడుల్లో భాగంగా ఉక్రెయిన్‌.. ఉత్తర కొరియాకు చెందిన రాకెట్లను వినియోగిస్తున్నట్లు ఓ వార్తాసంస్థ పేర్కొంది. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు ఉత్తర కొరియా ఆయుధ సాయం చేస్తోందని అమెరికా గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే.

Published : 29 Jul 2023 14:28 IST

కీవ్‌: రష్యా సైనిక చర్యలో భాగంగా మొదట్లో దారుణంగా దెబ్బతిన్న ఉక్రెయిన్‌ బలగాలు.. పశ్చిమ దేశాల ఆయుధ సాయంతో కొన్నాళ్లుగా ఎదురుదాడులకు దిగుతున్నాయి. అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ తదితర దేశాలు అత్యాధునిక ఆయుధాలను కీవ్‌కు అందజేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తర కొరియాకు చెందిన రాకెట్ల (North Korean Rockets)తోనూ ఉక్రెయిన్‌.. రష్యా బలగాల (Russian Forces)పై ఎదురుదాడులకు దిగుతోన్నట్లు ఓ అంతర్జాతీయ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. ఓ మిత్ర దేశం ఆ ఆయుధాలను గతంలో రష్యా నుంచి స్వాధీనం చేసుకుని.. తమకు సరఫరా చేసినట్లు ఉక్రెయిన్‌ రక్షణశాఖ తెలిపినట్లు వార్తాసంస్థ తెలిసింది.

రష్యా, చైనా నేతల సమక్షంలో.. ఆయుధాలు ప్రదర్శించిన కిమ్‌

‘బఖ్ముత్‌’ ప్రాంతంలో రష్యాపై ఎదురుదాడులకుగానూ ఉక్రెయిన్‌ బలగాలు ‘ఉత్తర కొరియా’ రాకెట్లను వినియోగిస్తున్నట్లు వార్తాసంస్థ తెలిపింది. శిథిలమైన బఖ్ముత్‌ నగరం చుట్టూ ఉన్న భూభాగాన్ని ఉక్రెయిన్‌ ఇటీవల తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌పై యుద్ధంలో భాగంగా రష్యాకు ఉత్తర కొరియా ఆయుధ సాయం చేస్తోందని అమెరికా గతంలో పలుమార్లు ఆరోపించింది. కానీ, పరస్పరం మిత్రదేశాలైన రష్యా, ఉత్తర కొరియాలు మాత్రం ఈ వార్తలను కొట్టిపారేశాయి. మరోవైపు.. ఇటీవల ఉత్తర కొరియా నిర్వహించిన విక్టరీ డే వేడుకలకు చైనా, రష్యా రక్షణశాఖ ప్రతినిధులు హాజరుకావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని